AP DSC 2024 Update: అందుబాటులో మెగా డిఎస్సీ 2024 సిలబస్, విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
AP DSC 2024 Update: ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అనివార్య కారణాలతో డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరించడానికి ఆలస్యమవుతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు వీలుగా సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్టేట్ ఇచ్చింది. నోటిఫికేషన్ వెలువరించడానికి మరికొన్ని నెలల సమయం ఉండటంతో అభ్యర్థుల పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది . త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే లోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డిఎస్సీ సిలబస్ నవంబర్ 27వ తేదీ 4 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఏపీ డిఎస్సీ వెబ్సైట్‌లో సిలబస్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. అభ్యర్థులు మెగా డిఎస్సి సిలబస్ ను https://apdsc2024.apcfss.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రిజర్వేషన్ల వివాదంతో ఆలస్యం..
ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలు, నియమకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వంలో డిఎస్సీ 2024 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగుల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలకు ముందు 6100పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డిఎస్సీకి సంతకం చేశారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారు.
న్యాయవివాదాలకు తావివ్వకుండా నియామకాలు..
డిఎస్సీ నోటిఫికేషన్‌పై పల్లా శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ స్పందించారు. డిఎస్సీపై లీగల్ ఒపినియన్ అడిగామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, న్యాయవివాదాలు తావివ్వకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ పూర్తి చేస్తామన్నారు. 1994 నుంచి డిఎస్సీపై పడిన కేసులు అన్ని పరిశీలించి, పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నామన్నారు. గతంలో డిఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలు పరిశీలిస్తున్నామని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిరుద్యోగుల ఆశలు వృధా చేయకుండా, చిత్తశుద్దితో నోటిఫికేషన్ జారీ చేసి జీవో జారీ చేస్తామన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్తింపచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వీటన్నింటిని వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకొచ్చి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది.