Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాదం.. అల్లుడికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న భార్య భర్తలు
Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తకు కేన్సర్ వచ్చింది. దీంతో మనోవేదనకు గురైన భార్య భర్తలిద్దరూ అల్లుడికి ఫోన్ చేసి తాము చనిపోతున్నామని చెప్పారు. దహన సంస్కారాలు చేయాలని చెప్పి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుందొడ్డిలో విషాదం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మేలుందొడ్డి గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులు (50), నీలమ్మ (47) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాసులు టైలరింగ్, భార్య ఇళ్లలో పనులు చేస్తూ జీవిస్తున్నారు. కుమార్తె భార్గవికి వివాహం అయింది. కుమారుడు భాను ప్రకాష్ బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంత కాలంగా భార్య భర్తలిద్దరూ కుమారుడి వద్దే ఉంటున్నారు.
మూడు నెలల కిందట శ్రీనివాసులు అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆసుపత్రిలో చూపించారు. పరీక్షలు చేసిన తరువాత శ్రీనివాసులు కిడ్నీకి కేన్సర్ సోకిందని వైద్యులు తెలిపారు. భర్తకు కేన్సర్ ఉందని భార్యకు తెలిసింది. దీంతో వారిద్దరూ లోలోపల మదనపడేవారు. రెండేళ్ల కిందట శ్రీనివాసులు అక్క లక్ష్మీదేవి కూడా కేన్సర్ వ్యాధితో మృతి చెందింది. అప్పట్లో అక్కకు దగ్గరుండి వైద్య సేవలందించినా ప్రయోజనం లేక మరణించిందని శ్రీనివాసులు మనోవేదన చెందారు.
ఈ క్రమంలో శ్రీనివాసులుకు కేన్సర్ రావడంతో కలత చెందారు. ఆదివారం బెంగళూరు నుంచి స్వగ్రామం మేలుందొడ్డికి భార్య భర్తలు వచ్చారు. తన అల్లుడికి ఫోన్ చేసి తాము చనిపోతున్నామని, దహన సంస్కారాలు చేయాలని, మీరందరూ బాగుండాలని అని చెప్పి ఫోన్ కట్ చేశారు. వారిద్దరూ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు చూసి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహాలను చెట్టు నుంచి దింపి పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పుంగనూరు సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనతో మేలుందొడ్డి గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యల రోదనలు మిన్నంటాయి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)