Pawan Kalyan : ఆర్జీవీ కేసుపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్, ఆ విషయం నేరుగా సీఎంనే అడుగుతానని రిప్లై
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రేపు ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీతో పవన్ భేటీ కానున్నారు. దిల్లీ పర్యటనలో పవన్ వ్యాఖ్యలు చేశారు.
దిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం ఉదయం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ పలు కీలక అంశాలు చర్చించినట్లు పవన్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... జలశక్తి మంత్రిగా షెకావత్ పోలవరం నిర్మాణానికి ఎంతగానో సహకరించారన్నారు. ఏపీ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామన్నారు. ఏపీకి 975 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే ఏపీలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
జలజీవన్ మిషన్ కు బడ్జెట్ ను పెంచాలని కేంద్రమంత్రిని కోరామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పోలవరంపై సీఎం మాట్లాడుతారన్న ఆయన.. గత ప్రభుత్వం చేసిన తప్పులు వారసత్వంగా వస్తున్నాయన్నారు. ఏపీలో జనజీవన్ మిషన్ పై రెండు మూడు వారాల్లో డీపీఆర్ ఇస్తామన్నారు. ప్రధాని మోదీతో భేటీలో జల జీవన్ మిషన్ పై చర్చిస్తానన్నారు. ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు అందించాలనేది ప్రధాని మోదీ లక్ష్యం అన్నారు. ఏపీలో పైప్ లైన్స్, డిజైనింగ్ లోపాలు ఉన్నాయన్నారు. సౌర విద్యుత్ టెండర్ల అవినీతిపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వలో సమోసలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎంత బాధ్యతారాహిత్యం వ్యవహరించారో అర్థం అవుతుందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏపీలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పవన్ అన్నారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న టూరిజాన్ని సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు.
ఆర్జీవీ గాలింపుపై పవన్ స్పందన
ఆర్జీవీ కోసం పోలీసులు గాలిస్తున్న విషయంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. తన పని తాను చేస్తున్నానన్నారు. పోలీసులు పనివాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి చూస్తారని, తాను చెయ్యడం లేదు అంటూ పవన్ కల్యాణ్ బదులిచ్చారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారనే విషయాన్ని సీఎం అడుగుతానన్నారు. దిల్లీలో మీడియా వాళ్లు అడిగారని చెప్తానన్నారు.
అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఇవాళ సాయంత్రం రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో పవన్ భేటీ కానున్నారు. రేపు ఉదయం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
సంబంధిత కథనం