Raju Srivastava | టీవీ ప్రేక్షకులకు రాజు శ్రీవాస్తవ చిర పరిచితుడు. అభిమాన కమెడియన్ కూడా. `ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్`(The Great Indian Laughter Challenge) సిరీస్‌లను చూసిన వారిలో రాజు శ్రీ వాస్తవ అభిమానులు కానివారు ఎవరూ ఉండరు. తన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, వింతైన గొంతు, మంచి అభినయంతో చాలామంది అభిమానులను ఆయన సంపాదించారు.
సోనీ టీవీలో అత్యంత పాపులర్ షో లాఫ్టర్ చాలెంజ్. అందులో స్టాండ్ అప్ కమెడియన్‌గా వచ్చిన కపిల్ శర్మ వంటి వారు చాలా మంది తరువాత కాలంలో సినిమాల్లో, ఇతర కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. అలాంటి వారిలో రాజు శ్రీవాస్తవ ఒకరు. లాఫ్టర్ చాలెంజ్ స్టాండ్ అప్ కామెడీ షోలో వచ్చిన పాపులారిటీతో చాలా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు సంపాదించారు. సొంతంగా స్టాండ్ అప్ కామెడీ షో చేశారు.
ఢిల్లీలో బుధవారం ఉదయం జిమ్‌లో ట్రెడ్ మిల్‌పై వర్కౌట్ చేస్తుండగా రాజు శ్రీవాస్తవకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి, అక్కడే కుప్పకూలి పోయారు. దాంతో ఆయనను వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు రెండు సార్లు సీపీఆర్(cardiopulmonary resuscitation -CPR) ఇచ్చి, ప్రాణ దానం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజు శ్రీవాస్తవ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.