Electric Cars With Solar Charging : భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లకు సోలార్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ వస్తుందా?
Electric Cars With Solar Charging : ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వాహనాన్ని ఛార్జింగ్ చేసేందుకు ఒక ప్రదేశంలో ఉండాలి. అదే సోలార్ ఛార్జింగ్ అయితే ఇలా ఉండాల్సిన అవసరం లేదు. కారు నడుస్తుంటే ఛార్జింగ్ అవుతుంది. ఇలాంటి టెక్నాలజీని భవిష్యత్తులో ఊహించవచ్చా?
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లకు మరింత డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే భారత్‌లాంటి దేశాల్లో వీటి వాడకం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలు చాలా దేశాల్లో పెద్దగా అందుబాటులో లేవు. దీంతో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు కొన్ని దేశాల్లో ఎక్కువగా వాడటం లేదు. అయితే ఎలక్ట్రిక్ కారు బ్యాటరీలు సోలార్ ప్యానెల్స్‌తో ఛార్జ్ చేయవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
అనేక గృహాలు, కార్యాలయాలలో సౌర ఫలకాలను చూస్తుంటాం. దీని టెక్నిక్ చాలా సులభం.. సూర్యరశ్మిని విద్యుత్తుగా మారుస్తుంది. ఇన్‌స్టాలేషన్‌కు కొంచెం ఎక్కువ ఖర్చవుతున్నప్పటికీ సోలార్ ప్యానెల్‌లు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తాయి. ముఖ్యంగా సోలార్ ప్యానెళ్ల ద్వారా కరెంటు పొందడం వల్ల బిల్లు ఉండదు.
సౌరశక్తి నుండి వచ్చే విద్యుత్తు అనేది గృహాలు, కార్యాలయాలు, దుకాణాలలో మాత్రమే వాడుతున్నారు. కార్ల వంటి కదిలే వస్తువులలో ప్రస్తుతం లేవు. ఒకవేళ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లలో కూడా సోలార్ ఛార్జింగ్ అందుబాటులోకి రావొచ్చు. ఇదే జరిగితే.. కారు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సమయం వృథా చేయాల్సిన అవసరమే ఉండదు. కారు నడుస్తున్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది.
ఛార్జింగ్ కంట్రోలర్ పరికరాలను బ్యాటరీ నిరంతరం ఓవర్‌ఛార్జ్ చేయకుండా చూసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇది ఎల్లప్పుడూ కారు బ్యాటరీపై నిఘా ఉండేలా డిజైన్ చేయాలి. సూర్యరశ్మి లేని సమయంలో ఎలక్ట్రిక్ కారును నిరంతరాయంగా ఉపయోగించడానికి ఉదయం పొందిన ఛార్జింగ్‌ను నిల్వ చేయడానికి, తరువాత సరఫరా చేసేందుకు కెపాసిటర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ కెపాసిటర్‌ను కారు బ్యాటరీ సామర్థ్యం కంటే తక్కువ సామర్థ్యంతో ఉపయోగించాలి. ఎందుకంటే అప్పుడే కారు బ్యాటరీ కెపాసిటర్ నుంచి తగినంత ఛార్జ్ తీసుకుంటుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సోలార్ ప్యానెల్స్‌తో కార్లకు ఛార్జింగ్ పెటుకుంటున్నారు. అది ఎలా అంటే.. తమ ఇళ్లపై ఇప్పటికే ఉన్న సోలార్ ప్యానెల్స్‌ని ఉపయోగించి. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నేరుగా ఇంటిలోని కార్ ఛార్జింగ్ పాయింట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
8 నుంచి 12 సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా 1 నుంచి 4 కిలోవాట్ల శక్తిని పొందవచ్చు. కారు బ్యాటరీ సామర్థ్యం, సౌర ఫలకాలను ఛార్జ్ చేయడానికి పట్టే సమయాన్ని బట్టి ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయవచ్చు. ఎక్కువ కెపాసిటీ ఉన్న పెద్ద బ్యాటరీ అంటే కారుకు మరిన్ని సోలార్ ప్యానెల్స్ అమర్చాల్సి ఉంటుంది. కారు రూఫ్ మీద సోలార్ ప్యానల్స్ పెట్టాలి.
సాధ్యం కాదు అనుకున్న చాలా పనులు చేశాడు మానవుడు. అలాగే సోలార్ ద్వారా ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు కూడా భవిష్యత్తులో రావొచ్చు. ఇదే జరిగితే బయట తిరుగుతూ కూడా కారును ఛార్జింగ్ చేసుకోవచ్చు.