Tirumala : తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలు కూడా తీసుకోండి.. టీటీడీ ఛైర్మన్‌కు హరీష్ రావు విజ్ఞప్తి
Tirumala : తిరుమల.. తెలుగు ప్రజలు ఎంతో ఆరాధించే దైవక్షేత్రం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. దీంతో తెలంగాణ వారి లేఖలు కూడా తీసుకోవాలని హరీష్ రావు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బి.ఆర్. నాయుడు.. మాజీ మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు నాయుడుకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. మీడియా రంగంలో సుదీర్ఘ కాలంగా విశేష సేవలు అందించిన బీఆర్ నాయుడు.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు.. తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల స్వామి దర్శనం కోసం వస్తారని, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
హరీష్ రావు విజ్ఞప్తికి బీఆర్ నాయుడు స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవడం గురించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని చెప్పారు. అలాగే టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అటు సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని.. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.
బీఆర్ నాయుడు ఇటీవల కేటీఆర్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ టీటీడీ ఛైర్మన్‌ను శాలువాతో సత్కరించారు. కేటీఆర్ కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అలాగే తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ బోర్డులో చర్చిస్తామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.