Chinmoyi Krishna Das : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణ దాస్‌ అరెస్ట్‌పై స్పందించిన భారత్-bangladesh hindu monk chinmoy krishna das denied bail charged with sedition and india respond on his arrest ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chinmoyi Krishna Das : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణ దాస్‌ అరెస్ట్‌పై స్పందించిన భారత్

Chinmoyi Krishna Das : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణ దాస్‌ అరెస్ట్‌పై స్పందించిన భారత్

Anand Sai HT Telugu
Nov 26, 2024 04:29 PM IST

Chinmoyi Krishna Das Arrest : బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ అరెస్ట్ కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశద్రోహం కేసుకు సంబంధించి బంగ్లాదేశ్‌లోని స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించడంతో స్పందించింది.

చిన్మోయ్ కృష్ణ దాస్‌
చిన్మోయ్ కృష్ణ దాస్‌

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ స్పందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 'బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడాన్ని మేం ఆందోళన చెందుతున్నాం. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై తీవ్రవాద మూకలు దాడి చేస్తున్నాయి. తాజాగా ఈ ఘటనతో మరింత పెరిగే అవకాశం ఉంది. మైనారిటీల గృహాలు, వ్యాపార సంస్థలను కాల్చడం, దోచుకోవడం, అలాగే దొంగతనం, విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి అనేక కేసులు ఉన్నాయి.' అని విదేశాంగ శాఖ పేర్కొంది.

ఈ సందర్భంగా మైనారిటీలపై దాడుల అంశాన్ని భారత్ లేవనెత్తింది. ఘటనలకు పాల్పడినవారు పరారీలో ఉన్నప్పటికీ, శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్‌లను చేస్తున్న వారిపై ఆరోపణలు చేయడం దారుణమని విదేశాంగ శాఖ వెల్లడించింది. దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులపై కూడా ఆందోళన చెందుతున్నామని తెలిపింది.

హిందువులు, అన్ని మైనారిటీల భద్రతను చూసుకోవాలని మేం బంగ్లాదేశ్ అధికారులను కోరుతున్నామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. శాంతియుతంగా సమావేశమయ్యారని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడలని పేర్కొంది.

హిందూ సమాజంపై అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఇస్కాన్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసింది. విమానాశ్రయంలో అరెస్టు చేసి సోమవారం దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆయనను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.

బంగ్లాదేశ్‌లో హిందువుల నిరసనలకు అండగా ఉన్నారని చిన్మోయ్ కృష్ణ దాస్‌ని టార్గెట్ చేస్తున్నారని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ అన్నారు. అతడిని తీవ్రవాదిగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు. అన్ని నిరసనలు శాంతియుతంగా చేశారని గుర్తు చేశారు. తప్పుడు అభియోగాలు మోపి విమానాశ్రయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని తెలిపారు.

'ఈ క్లిష్ట సమయంలో బంగ్లాదేశ్ మైనారిటీల ముఖంగా ఉన్న నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి అనే హిందూ సన్యాసిని ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారనే షాకింగ్ న్యూస్ నాకు ఇప్పుడే అందింది.' అని రాధారామన్ దాస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Whats_app_banner

టాపిక్