India vs Bangladesh Highlights: హైదరాబాద్ టీ20లో టీమిండియా రికార్డుల మోత.. బంగ్లాదేశ్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్
IND vs BAN 3rd T20 Highlights: టెస్టులతో పాటు టీ20ల్లోనూ బంగ్లాదేశ్‌ను భారత్ జట్టు చిత్తు చేసేసింది. దాంతో భారత్ పర్యటనలో కనీసం గెలుపు రుచి చూడకుండానే బంగ్లాదేశ్ టీమ్ సొంత దేశానికి పయనమవుతోంది.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కూడా భారత్ జట్టు క్లీన్‌స్వీప్ చేసేసింది. హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా భారత్ జట్టు 2-0తో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది.
సంజు శాంసన్ ఫస్ట్ టైమ్ సెంచరీ
మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో ఓపెనర్ సంజు శాంసన్ 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. టీ20 కెరీర్‌లో సంజు శాంసన్‌కి ఇదే తొలి సెంచరీ.
బిష్ణోయ్ దెబ్బకి విలవిల
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో తోవిడ్ హ్రిడోయ్ మాత్రమే 42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల నుంచి అతనికి సహకారం లభించలేదు. భారత్ బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మయాంక్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డికి చెరో వికెట్ దక్కింది.
రికార్డుల మోత
ఉప్పల్ స్టేడియంలో బౌండరీల మోత మోగించిన భారత్ జట్టు.. టీ20ల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ బ్యాటర్లు కలిపి ఏకంగా 71 బౌండరీలు నమోదు చేశారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు టీ20ల్లో 200 ప్లస్ స్కోరు చేసిన టీమ్‌గా భారత్ నిలిచింది. టీమిండియా ఏడో సారి 200 ప్లస్ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 461 పరుగులు నమోదవగా.. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్ ఇది. టాప్‌లో 472 పరుగులతో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ టీమ్ మ్యాచ్ ఉంది.
టీ20 ఫార్మాట్‌లో భారత్ జట్టుకి ఇదే అత్యధిక స్కోరు. ఇప్పటి వరకు 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై ఆ రికార్డ్‌ను బద్ధలు కొడుతూ 297 పరుగులు చేసింది. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డ్ నేపాల్ టీమ్ పేరిట ఉంది. ఆ జట్టు 2023లో మంగోలియాపై 314 పరుగులు చేసింది.