Mohammed Siraj: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్, మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్‌కి చెందిన ఈ పేసర్ గత ఏడేళ్లుగా భారత్ జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా బాధ్యతలు చేపట్టాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మహ్మద్ సిరాజ్‌కి గ్రూప్-1 ర్యాంక్ ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లే.. డీజీపీ కార్యాలయంలో మహ్మద్ సిరాజ్‌కి డీజీపీ కార్యాలయంలో నియామకపత్రాన్ని అధికారులు అందజేశారు. సిరాజ్ తండ్రి గతంలో హైదరాబాద్‌లో ఆటో నడిపేవారు.
టీ20 వరల్డ్ కప్ హీరోల్లో ఒకడు
డీఎస్పీగా నియామక పత్రం అందుకున్న మహ్మద్ సిరాజ్ తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మహ్మద్ సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్ జట్టులో మహ్మద్ సిరాజ్ కూడా సభ్యుడు. ఆ టోర్నీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మహ్మద్ సిరాజ్ కలిశాడు.
జూబ్లీహిల్స్‌లో స్థలం కూడా
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే మహ్మద్ సిరాజ్‌కి జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లో సుమారు 600 చదరపు గజాల స్థలం కూడా వచ్చింది. ఫాస్ట్ బౌలర్‌కి ఆ స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజాగా డీఎస్పీ ఉద్యోగం కూడా సిరాజ్‌కి దక్కింది.
2017లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ సిరాజ్.. అనతికాలంలోనే నమ్మదగిన ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. మరీ ముఖ్యంగా.. టెస్టుల్లో అతను రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 29 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లను ఈ హైదరాబాద్ పేసర్ ఆడాడు. టీ20 వరల్డ్‌కప్ మాత్రమే కాదు వన్డే వరల్డ్‌కప్, టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడిన జట్టులోనూ మహ్మద్ సిరాజ్ సభ్యుడిగా ఉన్నాడు.