Mohammed Siraj No.1: మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్.. హైదరాబాదీ పేసర్ సంచలనం
Mohammed Siraj No.1: మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ అయ్యాడు. బుధవారం (జనవరి 25) ఐసీసీ రిలీజ్ వన్డే ర్యాంకింగ్స్ లో సిరాజ్ టాప్ లో ఉన్నాడు. ఈ హైదరాబాదీ పేసర్ సంచలన బౌలింగ్ తో ఈ మధ్య కాలంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
Mohammed Siraj No.1: హైదరాబాదీ పేస్ సెన్సేషన్ మహ్మద్ సిరాజ్ తాజాగా వన్డేల్లో నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ బుధవారం (జనవరి 25) రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో సిరాజ్ కు అగ్రస్థానం దక్కింది. ఈ మధ్యే శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన వన్డే సిరీస్ లలో సిరాజ్ కళ్లు చెదిరే బౌలింగ్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
కొంతకాలంగా టీమ్ లో ప్రధాన బౌలర్ బుమ్రా లేని లోటును భర్తీ చేస్తున్న సిరాజ్.. ఇప్పుడు ఏకంగా నంబర్ వన్ బౌలర్ గా ఎదగడం విశేషం. శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో, న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో సిరాజ్ నాలుగేసి వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంకతో సిరీస్ లో అయితే ఏకంగా 10.22 సగటుతో 9 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.
ఇక న్యూజిలాండ్ తో సిరీస్ లోనూ ఐదు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ చివరి వన్డేలో ఆడలేదు. ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2022లోనూ సిరాజ్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అతనితోపాటు శ్రేయస్ అయ్యర్ కు ఆ టీమ్ లో చోటు దక్కింది. ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్ లో సిరాజ్ 729 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు.
మంగళవారం న్యూజిలాండ్ ను మూడు వన్డేల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత టీమిండియా కూడా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక తాజా ర్యాంకుల్లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరోస్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో అతడు ఏకంగా 360 పరుగులు చేసిన వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ కు చేరుకున్నాడు.
మరోవైపు న్యూజిలాండ్ సిరీస్ లో పెద్దగా రాణించని విరాట్ కోహ్లి ఏడో స్థానానికి పడిపోయాడు. ఇక కివీస్ తో చివరి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్ అందుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం టాప్ లో కొనసాగుతున్నాడు.
సంబంధిత కథనం