IND vs BAN: కాన్పూర్ టెస్టులో విజయానికి భారత్ జట్టు బాటలు.. పేకమేడని తలపిస్తున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్-india vs bangladesh 2nd test day 5 jasprit bumrah strikes bangladesh 8 down ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban: కాన్పూర్ టెస్టులో విజయానికి భారత్ జట్టు బాటలు.. పేకమేడని తలపిస్తున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్

IND vs BAN: కాన్పూర్ టెస్టులో విజయానికి భారత్ జట్టు బాటలు.. పేకమేడని తలపిస్తున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్

Galeti Rajendra HT Telugu
Oct 01, 2024 11:55 AM IST

IND vs BAN 2nd Test: కాన్పూర్ టెస్టులో విజయానికి భారత్ జట్టు బాటలు వేసుకుంది. మ్యాచ్‌లో చివరి రోజైన మంగళవారం వరుసగా బంగ్లాదేశ్ వికెట్లను పడగొడుతోంది. దాంతో ఈరోజు రెండో సెషన్‌లోనే మ్యాచ్ ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్ వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా
బంగ్లాదేశ్ వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా (PTI)

Kanpur Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌లో ఐదో రోజైన మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 26/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ టీమ్.. లంచ్ విరామ సమయానికి 126/8తో నిలిచింది.

క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (23 బ్యాటింగ్ : 30 బంతుల్లో 5x4), తైజుల్ ఇస్లాం (0 బ్యాటింగ్: 9 బంతుల్లో) ఉన్నారు. ఆటలో ఇంకా రెండు సెషన్లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ కేవలం 74 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాంతో రెండో సెషన్‌లో 150 పరుగుల లోపే బంగ్లాదేశ్‌ను భారత్ బౌలర్లు ఆలౌట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల ఆధిక్యం భారత్ జట్టుకి లభించి ఉండటంతో.. భారత్ ముందు 100 పరుగుల లోపే లక్ష్యం ఉండే అవకాశం ఉంది.

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా.. శనివారం, ఆదివారం వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో నాలుగో రోజైన సోమవారం తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టీమ్ 233 పరుగులకి ఆలౌటైంది.

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు చివరి సెషన్‌లో 285/9తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దాంతో టీమిండియాకి 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ జైశ్వాల్ 72 పరుగులు, కేఎల్ రాహుల్ 68 పరుగులతో భారత్ జట్టుకి మెరుగైన స్కోరుని అందించారు. టీ20 తరహాలో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను సోమవారం ఆడేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టీమ్‌లో ఓపెనర్ షదామ్ ఇస్లాం (50) మాత్రమే హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు అందరూ వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు. భారత్ బౌలర్లలో అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు.