IND vs BAN Kanpur Test: రెండో టెస్టు డ్రా అయితే బంగ్లాదేశ్ కంటే టీమిండియాకే ఎక్కువ దెబ్బ!
Kanpur Test: బంగ్లాదేశ్‌పై కాన్పూర్ టెస్టులో భారత్ జట్టు సులువుగా గెలిచే అవకాశం ఉంది. కానీ వర్షంతో మ్యాచ్ సజావుగా జరగడం లేదు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే బంగ్లాదేశ్ కంటే భారత్ జట్టుకే ఎక్కువ నష్టం జరగనుంది.
IND vs BAN 2nd Test: కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకి వరుణుడు పదే పదే అంతరాయం కలిగిస్తున్నాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా.. శనివారం వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయింది.
ఆటలో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. కాన్పూర్‌లో ఈ మూడు రోజులూ వర్షం పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో మ్యాచ్ డ్రా అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2023-2025) పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ కంటే ఎక్కువగా నష్టపోయేది భారత్ జట్టు.
భారత్ జట్టు టాప్‌లో ఉన్నా..
వాస్తవానికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ జట్టు ప్రస్తుతం 71.67 శాతం విజయాలలో టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ 39.29 శాతం విజయాలతో పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కాన్పూర్ టెస్టు డ్రా అయితే బంగ్లాదేశ్ పెద్దగా నష్టపోయేది ఉండదు. కానీ భారత్ జట్టు మాత్రం టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలంటే రానున్న టెస్టు సిరీస్‌ల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను తప్పక ఓడించాలి.
డ్రా అయితే.. పాయింట్లు షేర్
చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్‌పై అలవోకగా 280 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ జట్టు.. కాన్పూర్‌లోనూ సులువుగా ఆ జట్టుపై గెలిచే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పూర్ టెస్టు డ్రా అయితే బంగ్లాదేశ్‌తో టీమిండియా పాయింట్లను పంచుకోవాల్సి వస్తుంది.
టెస్టు మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లకీ 4 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్‌ను భారత్ గెలిస్తే అప్పుడు 12 పాయింట్లు వస్తాయి. మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. ఓవరాల్ విజయాల శాతంలోనూ కూడా భారత్ 71.67 నుంచి 68.18 శాతానికి పడిపోతుంది. అదే మ్యాచ్‌లో గెలిస్తే 74.24 శాతానికి పెరుగుతుంది. నెం.1 స్థానం మరింత పదిలం అవుతుంది.
బంగ్లాకి పెద్ద నష్టం లేదు
బంగ్లాదేశ్ విషయానికొస్తే కాన్పూర్ టెస్టు డ్రా తర్వాత ఆ జట్టు 39.29 నుంచి 38.54 శాతానికి పడిపోతుంది. ఒకవేళ పొరపాటున గెలిస్తే మాత్రం 46.87 శాతానికి విజయాల శాతాన్ని పెంచుకుంటుంది. అంతేకాదు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి బంగ్లాదేశ్ చేరడం కష్టమే. కానీ మ్యాచ్ డ్రా అయితే మాత్రం భారత్ జట్టు ఫైనల్ చేరడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ఓవరాల్‌గా మ్యాచ్ డ్రా అయితే బంగ్లాదేశ్ కంటే ఎక్కువ నష్టపోయేది భారత్ జట్టు.
కాన్పూర్ టెస్టుని మినహాయిస్తే.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ లోపు 8 టెస్టులు ఆడాల్సి ఉండగా, అందులో కనీసం 5 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. ఇందులో న్యూజిలాండ్‌తో 3, ఆస్ట్రేలియాతో 5 టెస్టులను భారత్ జట్టు ఆడనుంది. కాబట్టి కాన్పూర్ టెస్టులో భారత్ గెలిస్తే తప్పక గెలవాల్సిన మ్యాచ్ సంఖ్య ఒకటి తగ్గుతుంది.