IND vs BAN 2nd Test Toss Updates: కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన భారత్, తుది జట్టులో మార్పుల్లేవ్-india vs bangladesh 2nd test day 1 live updates india won the toss and opt to bowl ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban 2nd Test Toss Updates: కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన భారత్, తుది జట్టులో మార్పుల్లేవ్

IND vs BAN 2nd Test Toss Updates: కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన భారత్, తుది జట్టులో మార్పుల్లేవ్

Galeti Rajendra HT Telugu
Sep 27, 2024 10:12 AM IST

IND vs BAN Test Series 2024: చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన భారత్ జట్టు ఈరోజు ప్రారంభంకానున్న కాన్పూర్ టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని ఆశిస్తోంది. భారత బ్యాటర్లు శుభమన్ గిల్, రిషబ్ పంత్‌తో పాటు అశ్విన్, జడేజా టచ్‌లోకి రావడం టీమిండియాకి కలిసొచ్చే అంశం.

కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ
కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ (PTI)

India vs Bangladesh 2nd Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం (సెప్టెంబరు 27) రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తుండగా.. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఉదయం 9 గంటలకి పడాల్సిన టాస్ వర్షం కారణంగా 10 గంటలకి పడగా.. 9.30 గంటకి ప్రారంభంకావాల్సిన ఆట గంట ఆలస్యంగా 10.30 గంటలకి స్టార్ట్ అవుతోంది.

కాన్పూర్ పిచ్ స్పిన్‌కి అనుకూలమని వార్తలు వచ్చినా.. తుది జట్టులో మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ ఇష్టపడలేదు. చెపాక్ టెస్టులో ఆడిన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌నే కాన్పూర్ టెస్టుకీ కొనసాగించాడు. దాంతో తుది జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. బంగ్లాదేశ్ మాత్రం రెండు మార్పులు చేసింది. నహీద్, తస్కిన్ స్థానంలో తైజుల్, ఖలీద్‌ను టీమ్‌లోకి కెప్టెన్ శాంటో తీసుకున్నాడు.

రెండో టెస్టుకి భారత్ తుది జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

పిచ్ ఎలా ఉంది?


కాన్పూర్ పిచ్ సహజసిద్ధంగా స్పిన్‌కి అనుకూలిస్తుంది. కానీ ఈ మ్యాచ్‌కి కోసం రూపొందించిన పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది. కాబట్టి.. మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఫాస్ట్ బౌలర్లకి పిచ్ నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ జరిగేకొద్దీ స్లో అండ్ లో బౌన్స్ చూస్తారని పిచ్‌ను పరిశీలించిన మాజీ క్రికెటర్, అనలిస్ట్ మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

రెండు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే చెన్నైలోని చెపాక్ వేదికగా గత వారం తొలి టెస్టు జరిగింది. ఆ టెస్టులో భారత్ జట్టు 280 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

పాక్‌ని ఓడించి వచ్చి.. భారత్‌లో భంగపాటు

మరోవైపు పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపై ఇటీవల ఓడించి వచ్చిన బంగ్లాదేశ్ టీమ్.. భారత్ గడ్డపై తొలి టెస్టులో తేలిపోయింది. చెపాక్ టెస్టులో కనీస పోటీని కూడా బంగ్లాదేశ్ ఇవ్వలేకపోయింది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కి తొలి రోజు మెరుగైన ఆరంభం లభించినా.. భారత వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ బాదడంతో ఒత్తిడిలోకి వెళ్లిన పర్యాటక జట్టు.. మ్యాచ్ ముగిసే వరకూ కోలుకోలేకపోయింది.

తొలి టెస్టులో అశ్విన్‌తో పాటు శుభమన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు బాదేశారు. అలానే బౌలింగ్‌లో బుమ్రా, అశ్విన్, జడేజా మెరుగైన ప్రదర్శన కనబర్చారు.

మరోవైపు బంగ్లాదేశ్ నుంచి కనీస ప్రతిఘటన కూడా కనిపించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ 5 వికెట్లు తీయడం, రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శాంటో 82 పరుగులు చేయడం ఒక్కటే ఆ జట్టుకి ఊరటనిచ్చింది.