Peddapalli Youth: డిసెంబర్ 4న నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో సీఎం విజయోత్సవ సభ.. నియామక పత్రాలు అందజేయనున్న సీఎం
Peddapalli Youth: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై గ్రూప్ 4 తో పాటు వివిధ పరీక్షల్లో రిక్రూటైన 9 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.
Peddapalli Youth: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తుండటంతో పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకు పెద్దపల్లి జిల్లా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఆ రోజు నిరుద్యోగ యువతితో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇటీవల వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు ఎంపికైన 9 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అందుకు భారీ బహిరంగ సభకు అనువైన స్థలాన్ని అధికారులు పరీశీలించారు.
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులతో కలిసి పెద్దకల్వల లోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని, పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. సభా స్థలాన్ని పరిశీలించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా విజయోత్సవాలు...
ప్రజా పాలన ప్రజా విజయోత్సవం వేడుకలను డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అందులో భాగంగా డిసెంబర్ 4న పెద్దపెల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరుపుతుందని తెలిపారు. నిరుద్యోగ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై గ్రూప్ 4, ఇతర వివిధ పోటీ పరీక్షలకు కింద ఎంపికైన 9 వేల మది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఎం టూర్ ప్రజా పాలన విజయోత్సవ సభ సందర్భంగా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు తనిఖీ...
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పెద్దకల్వలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు వెంటనే జరిగేలా చూడాలని ఆదేశించారు. నాణ్యమైన ధాన్యాన్ని త్వరగా కాంటా వేసి కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం డబ్బులు రైతులకు సకాలంలో చెల్లించేలా వివరాలను ఓపిఎంఎస్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)