Ind vs Ban 2nd Test: ఇండియాను ఓడించడం అసాధ్యం.. పాకిస్థాన్ అలా కాదు: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్
Ind vs Ban 2nd Test: టీమిండియాను వాళ్ల స్వదేశంలో ఓడించడం అసాధ్యమని అన్నాడు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్. పాకిస్థాన్ అంతగా అనుభవం లేని జట్టు అని, అందుకే వాళ్లను ఓడించగలిగామని చెప్పాడు.
Ind vs Ban 2nd Test: టీమిండియాతో కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పాడు. స్వదేశంలో ఇండియా అజేయమైన జట్టు అని, పాకిస్థాన్ అంతగా అనుభవం లేని టీమ్ అని అన్నాడు. పాకిస్థాన్ ను వాళ్ల దేశంలోనే 2-0తో ఓడించి ఇండియాకు వచ్చిన బంగ్లాదేశ్ తొలి టెస్టులో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.
టీమిండియా అజేయమైనది
టీమిండియాతో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లా టీమ్ 280 పరుగులతో ఓడింది. ఇప్పుడు రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆ టీమ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్.. ఇండియన్ టీమ్ పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో పాకిస్థాన్ జట్టులో ఉన్న లోపాన్ని ఎత్తి చూపాడు.
"పాకిస్థాన్ ఓ కొత్త టీమ్ లా కనిపిస్తోంది. అంతగా అనుభం లేదు. మేము ఆడిన మ్యాచ్ లు, వాళ్లు ఆడిన మ్యాచ్ లు చూస్తే.. మా జట్టులోనే అనుభజ్ఞులు ఎక్కువగా ఉన్నారు. టెస్టు క్రికెట్ లో అది చాలా ముఖ్యమైన విషయం" అని షకీబ్ అన్నాడు.
"ఇక ఇండియా విషయానికి వస్తే వాళ్ల ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్షిప్ లో నంబర్ వన్ టీమ్. స్వదేశంలో అజేయమైన టీమ్ అది. ఎక్కడో నేను చూశాను.. 4 వేల రోజులుగా ఇండియా అజేయంగా ఉంది. వాళ్లది ఎంత మంచి టీమో దీనిని బట్టే తెలుస్తోంది. ఇండియా బయట కూడా బాగా ఆడుతోంది. ఇండియాకు వచ్చిన ఏ టీమ్ కు అయినా కష్టమే. మేము కూడా అందుకు భిన్నమేమీ కాదు. అయితే వాళ్లను ఓడించాలంటే మా అత్యుత్తమ ఆట ఆడాల్సిందే" అని షకీబ్ అన్నాడు.
బాగానే ఆడాము కానీ..
బంగ్లాదేశ్ ఇప్పటి వరకూ టెస్ట్ క్రికెట్ లో ఇండియాను ఒక్కసారి కూడా ఓడించలేదు. 14 మ్యాచ్ లలో 12 ఇండియా గెలవగా.. రెండు డ్రాగా ముగిశాయి. అయితే ఈ మధ్యే పాకిస్థాన్ ను ఓడించి రావడంతో బంగ్లాదేశ్ తో కాస్త ముప్పు ఉంటుందని భావించినా.. తొలి టెస్టులో ఆ టీమ్ చిత్తుగా ఓడింది. అయితే దీనికి నిందను పిచ్ లపై తాను వేయబోనని షకీబ్ అన్నాడు.
"ఇతర దేశాలను తీసుకుంటే.. అప్పుడప్పుడూ ఒకటో రెండు మ్యాచ్ లు ఓడిపోతూనే ఉంటారు. కానీ ఇండియా టెస్టుల్లో ఓడిపోవడం అత్యంత అరుదు. వాళ్లపై బంగ్లాదేశ్ లో వన్డే సిరీస్ గెలిచాం. ఓ టెస్టులో విజయానికి దగ్గరగా వచ్చాం. టెస్టు క్రికెట్ లో మేను అనుకున్న విజయాలు సాధించలేకపోయాం. మాకు రేపు మరో అవకాశం రాబోతోంది. చెన్నైలోనూ అక్కడక్కడా బాగానే ఆడాం. కానీ మూడున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగియడం మంచిది కాదు. మాది అంతకంటే మంచి టీమే అనుకుంటాను. అది రేపటి మ్యాచ్ లో చూపించాలి" అని షకీబ్ అన్నాడు.
టీమిండియా స్వదేశంలో చివరిసారి 2012-13లో ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత ఈ 12 ఏళ్లలో వరుసగా ఏకంగా 17 సిరీస్ లను గెలిచింది. పాకిస్థాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. బంగ్లాదేశ్ తో సిరీస్ ఓడిపోయింది. అంతకుముందు న్యూజిలాండ్ తో సిరీస్ డ్రా చేసుకోగా.. ఇంగ్లండ్ చేతుల్లో వైట్ వాష్ అయింది.