Yoga Poses for Energy: ఉదయాన్నే మంచి ఎనర్జీని పెంచే ఐదు యోగాసనాలు ఇవి.. బద్ధకాన్ని బద్దలు చేసేస్తాయి!
Yoga Poses for Energy: కొన్ని రకాల యోగాసనాలు చేయడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. శరీరం బద్ధకంగా అనిపించడం పోతుంది. చురుకైన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఐదు యోగాసనాలు ఏవో ఇక్కడ చూడండి.
ఉదయం నిద్రలేవగానే కొన్నిసార్లు బాగా బద్ధకంగా అనిపిస్తుంది. శక్తి లేకుండా నీరసంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సరైన నిద్ర ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ఉదయాన్నే బద్ధకంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఉదయాన్నే కాస్త ఎనర్జీ కావాలి. యోగాసనాల ద్వారా కూడా శరీరంలో శక్తిని పెంచుకోవచ్చు. ఇందుకు కొన్ని ఆసనాలు తోడ్పడతాయి. బద్ధకాన్ని పోగొట్టి చురుగ్గా మారుస్తాయి. శరీరంలో ఎనర్జీని పెంచగల ఐదు యోగాసనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
వీరభద్రాసనం
వీరభద్రాసనం చేయడం వల్ల శరీరంలోని చాలా భాగాలు స్ట్రైచ్ అవుతాయి. దీనివల్ల బాడీలో రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా అవుతుంది. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. భుజాల సామర్థ్యాన్ని, శరీర బ్యాలెన్స్‌ను ఈ ఆసనం పెంచుతుంది. ఓ కాలిని వెనక్కి చాపి, మరో కాలిని ముందుకు పెట్టి, శరీరాన్ని వంచి చేతులను పైకి చూపిస్తూ నమస్కరిస్తున్నట్టుగా చేసే ఈ వీరభద్రాసనం వల్ల చాలా అవయావాలు ప్రేరేపితమవుతాయి. దీంతో చురుకుదనం పెరుగుతుంది. బద్ధకంగా ఉన్న ఫీలింగ్ బద్దలవుతుంది.
బాలాసనం
బాలాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. ఛాతి, వెన్ను, భుజాలు కూడా రిలాక్స్ అవుతాయి. నీరసంగా, శక్తిహీనంగా అనిపించినా.. ఈ ఆసనం వేస్తే శరీరంలో ఉత్తేజం పెరుగుతుంది. శక్తి పెరిగిన ఫీలింగ్ వస్తుంది. ఓచోట మోకాళ్లపై కూర్చొని.. శరీరాన్ని వంచి.. ముంజేతులను నేలకు ఆనించాలి. పిల్లలు బోర్లా పడుకున్న భంగిమలా ఈ బాలాసనం ఉంటుంది.
త్రికోణాసనం
శరీరంలోని కండరాలను త్రికోణాసనం ఉత్తేజ పరుస్తుంది. స్ట్రెచ్‍లు ఎక్కువగా ఉండడం వల్ల బద్ధకం వీడిపోయేలా ఈ ఆసనం చేయగలదు. కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరానికి బ్యాలెన్స్ పెంచుతుంది. కాళ్లను దూరంగా పెట్టి.. శరీరాన్ని వంచి చేయితో చేతి వేళ్లతో పాదాలను తాకేలా ఈ త్రికోణాసనం ఉంటుంది. రెండు వైపులా ఈ ఆసనం చేయాలి. దీనివల్ల బాడీ చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతుంది. ఫ్రెష్‍నెస్ వస్తుంది.
ధనూరాసనం
ధనూరాసనం వేయడం వల్ల కాళ్లు, చేతుల కండరాలపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. పొత్తి కడుపుపై శరీర భారం ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం లాంటి కడుపు సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఎనర్జీ పెరిగిన ఫీలింగ్ వస్తుంది. బోర్లా పడుకొని.. కాళ్లు, తలపైకి ఎత్తి.. చేతులతో పాదాలను పట్టుకొని ఈ ఆసనం చేయాలి. ఈ భంగిమ చేసే సమయంలో శరీరం విల్లులా వంగి ఉంటుంది.
గరుడాసనం
గరుడాసనం వేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. శరీరం కూడా రిలాక్స్ అయిన ఫీలింగ్‍కు గురవుతుంది. ఓ చోట నిలబడి చేతులు, కాళ్లు మెలిపెట్టి వేసే భంగిమ ఉండే ఈ ఆసనం వల్ల శరీర బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. శరీర వ్యర్థాలు సులభంగా బయటికి వెళ్లేలా ఈ యోగాసనం తోడ్పడుతుంది. శరీరంలో ఎనర్జీని ఈ గరుడాసనం పెంచగలదు. ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె పని తీరుకు గురుడాసనం తోడ్పాడునందిస్తుంది. మొడ, భుజాల నొప్పి తగ్గేందుకు కూడా ఈ ఆసనం వల్ల సహకరిస్తుంది.
టాపిక్