Yoga: ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటున్నారా? రెగ్యులర్‌గా ఈ సింపుల్ యోగాసనం వేయండి.. లాభాలు ఇవే
Yoga: యోగాలో కొన్ని ఆసనాలు సులువుగా ఉన్నా ప్రభావంతంగా పని చేస్తాయి. అందులో మండూకాసనం ఒకటి. ఈ ఆసనం వేయడం సులభమే అయినా.. లాభాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి.
ఉద్యోగం వల్ల రోజులో ఒకే చోట కూర్చొని చాలాసేపు పని చేస్తే దీర్ఘకాలంలో నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నాళ్లకు వెనుక భంగిమ కూడా సరిగా ఉండదు. కాలం గడుస్తున్న కొద్ది నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, యోగాలో కొన్ని ఆసనాలు ఇలా కాకుండా చేయగలవు. అలాంటిదే మండూకాసనం. ఎక్కువ సమయం కూర్చునే ఉండే వారు ప్రతీ రోజు ఈ ఆసనం వేస్తే వెన్ను నొప్పి రిస్క్ తగ్గుతుంది. ఈ ఆసనం వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మండూకాసనం వేయడం ఇలా..
- మండూకాసనం వేసేందుకు ముందు ఓ చోట నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత కాళ్లను పక్కకు దూరంగా చాపాలి.
- అనంతరం కిందికి వంగాలి. మోకాళ్లను నేలకు అనించాలి.
- ఆ తర్వాత రెండు ముంజేతులను కూడా నేలకు ఆనించాలి.
- శరీర బరువు మొత్తం కాళ్ల కింది భాగం, ముంజేతులపై ఉంటుంది.
- రెండు ముంజేతులు సమాతరంగా.. కాళ్లు మాత్రం ఒకదానికి ఒకటి దూరంగా ఉండాలి.
- ఈ భంగిమ చూసేందుకు కప్పలా ఉంటుంది. అందుకే దీన్ని మండూకాసనం అంటారు. ఇంగ్లిష్‍లో ఫ్రాగ్ పోజ్ అని పిలుస్తారు. ఇదే భంగిమలో కాసేపు ఉండాలి.
మండూకాసనంలో మరికొన్ని రకాలు ఉంటాయి. శరీరమంతా బోర్లా నేలకు ఆనించి రెండు కాళ్లు, చేతులు దూరంగా పెట్టి ఉంచడం కూడా ఓ రకం.
మోకాళ్లపై కింద కూర్చొని, రెండు చేతులు పొట్టపై పెట్టుకొని, తల నేలకు ఆనేలా వంగడం కూడా మరో రకమైన మండూకాసనం.
వెన్ను నొప్పి తగ్గిస్తుంది
మండూకాసనం వేయడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా రోజులో చాలా గంటలు ఒకే చోట కూర్చునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెనుక భంగిమ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. వెన్ను నొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడుముపై పడిన ఒత్తిడిని తగ్గించగలదు. వెన్ను పట్టుకుపోవడం నుంచి కూడా ఈ ఆసనం ఉపశమనం కలిగిస్తుంది.
ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది
మండూకాసనం ప్రతీ రోజు వేయడం వల్ల శరీర ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలపై పడిన ఒత్తిడిని ఇది తగ్గించగలదు. శరీర బ్యాలెన్స్‌ను కూడా మెరుగుపరుస్తుంది.
రక్తప్రసరణ, నిద్ర మెరుగు
మండూకాససం వేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. కొన్ని భాగాలకు రక్తం బాగా చేరి పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. కండరాల్లో వణుకును తగ్గించగలదు. ఈ ఆసనం చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. నిద్రను కూడా ఆసనం మెరుగుపరుస్తుంది. నాణ్యమైన నిద్ర పట్టేలా సహకరిస్తుంది.
టాపిక్