Yoga: ఈ ఆసనం ఎంతో సులభం.. ప్రయోజనాలు మాత్రం చాలా.. వివరాలివే
Sukhasana Yoga pose Benefits: యోగాలోని ఓ సులువైన ఆసనం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సుఖాసనం సింపుల్‍గా ఉన్నా దీని వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ ఆసనం గురించి వివరాలు ఇక్కడ చూడండి.
యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. విభిన్న యోగాసనాల ద్వారా ప్రయోజనాలు దక్కుతాయి. అయితే మీరు యోగాకు కొత్త అయితే.. ముందుగా ‘సుఖాసనం’ వేయాలని చెబుతారు. ఎందుకంటే ఇది అత్యంత సులువైన, ప్రభావంతమైన ఆసనం. అందుకే దీన్ని ఈజీ పోజ్ అని కూడా పిలుస్తారు. అయితే, ఆసనం సులభమే అయినా ముఖ్యమైన ప్రయోజనాలు సుఖాసనం ద్వారా కలుగుతాయి.
సుఖాసనం ఎలా వేయాలి?
సుఖాసనం వేసేందుకు ముందుగా సౌకర్యవంతంగా కూర్చునేందుకు తగినంత చోటును ఎంపిక చేసుకోవాలి. యోగా మ్యాట్ లేదా ఏదైనా కింద పరుచుకోవాలి. ముందుగా కూర్చొన్న తర్వాత కాళ్లను ముందుకు చాపాలి. ఆ తర్వాత ఎడమ కాలిని మడవాలి. ఎడమ పాదం.. కుడి తొడ కిందికి తీసుకురావాలి. ఆ తర్వాత కుడి కాలిని వంచి.. పాదం.. ఎడమ తొడ కిందికి వచ్చేలా కూర్చోవాలి.
వెన్ను నిటారుగా.. మోకాళ్లపై చేతులు..
అలా కూర్చున్న తర్వాత వెన్నును నిటారుగా ఉంచాలి. భుజాలను విశ్రాంతిగా వదిలేయాలి. నిటారుగా కూర్చోవడం మాత్రం చాలా ముఖ్యం. ఇక చేతులను మోకాళ్లపై పెట్టుకోవాలి. అరచేయి కిందికి, లేదా పైకి ఉండాలి. మోచేతులు కూడా రిలాక్స్ అయినట్టుగా ఉండాలి. అదే సుఖాసనం.
ఆ తర్వాత కళ్లు మూసుకోవాలి. సుఖాసనం వేస్తున్న సమయంలో శ్వాసమీద ఎక్కువగా ధ్యాస ఉండాలి. ముందు నిదానంగా, గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఫోకస్ అంతా శ్వాసమీదే ఉండాలి. వెన్నెముక నిటారుగా పెట్టి కొన్ని నిమిషాల పాటు సుఖాసనాన్ని అలాగే కొనసాగించాలి. ధ్యానంలా చేయాలి.
సుఖాసనంతో కలిగే ప్రయోజనాలు
ఏకాగ్రత పెరుగుతుంది: సుఖాసనం వేయడం వల్ల మీ మెదడు ప్రశాంతంగా మారుతుంది. దీంతో ఎంతో ప్రభావవంతంగా ఏకాగ్రతను, ఫోకస్‍ను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యానికి సుఖాసనం చాలా మేలు చేస్తుంది.
మెరుగైన భంగిమ: సుఖాసనంలో వెన్ను నిటారుగా ఉండేలా కూర్చుంటారు. దీంతో మీరు సాధారంగా కూర్చొనే భంగిమ మెరుగవుతుంది. నడుము, భుజాల కండరాలకు ఈ ఆసనం మేలు చేస్తుంది. నొప్పి వచ్చే రిస్క్ తగ్గిస్తుంది.
వెన్నెముక ఆరోగ్యం: సుఖాసనం వేయడం వల్ల వెన్ను నిటారుగా ఎక్కువసేపు ఉంటుంది. వెనుక ఉండే కండరాలు విస్తరిస్తాయి. ఈ ఆసనం రెగ్యులర్‌గా వేస్తే వెన్నెముక దృఢత్వం పెరుగుతుంది. వెన్ను నొప్పి రాకుండా ఉండేందుకు సహకరిస్తుంది. వెన్నులో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని పని చేసే వారు ఈ ఆసనం వేయడం చాలా ముఖ్యం.
రక్తప్రసరణ: సుఖాసనం వేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్, పోషకాల సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అయ్యేందుకు కూడా ఈ యోగాసనం ఉపకరిస్తుంది.
జీర్ణక్రియ మెరుగు: సుఖాసనం వేసేందుకు కూర్చొనే తీరు వల్ల జీర్ణవ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. జీర్ణం అయ్యేందుకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తగ్గేందుకు ఉపకరిస్తుంది. గ్యాస్ లాంటి కడుపు సంబంధిత సమస్యలు తగ్గేందుకు కూడా ఈ యోగాసనం సహకరిస్తుంది.
అరికాళ్లు, మోకాళ్లకు: సుఖాసనం వేయడం వల్ల అరికాళ్లు, మోకాళ్ల దృఢత్వం, ఫ్లెక్సిబులిటీ పెరుగుతాయి. రోజులో ఎక్కువసేపు కూర్చొనే వారికి, ఎక్కువగా నిలబడి ఉండే వారికి ఈ ఆసనం చాలా మేలే చేస్తుంది.
టాపిక్