యోగాలో అధిక సంఖ్యలో ఆసనాలు ఉంటాయి. ఆసనాలను బట్టి వాటి వల్ల శారీరకంగా, మానసికంగా వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. కొందరికి రాత్రివేళ సరిగా నిద్రపట్టదు. నిద్రలోకి జారుకునేందుకు నానా తంటాలు పడుతూ బెడ్‍పై పొర్లుతూ ఉంటారు. నిద్రలేమితో బాధడుతుంటారు. అయితే, వేగంగా నిద్రపట్టేందుకు కూడా యోగాలో కొన్ని ఆసనాలు తోడ్పడతాయి. త్వరగా పడుకునేలా చేసి.. నిద్ర నాణ్యతను కూడా పెంచగలవు. అలా నిద్రను మెరుగు చేసే మూడు ఆసనాలు ఏవో ఇక్కడ చూడండి.
యోగాలో బాలాసనం చాలా సులువైనది. ఈ ఆసనం రోజులో ఎప్పుడైనా వేయవచ్చు. దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఈ ఆసనం చేయడం నిద్ర త్వరగా పట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ రాత్రివేళ నిద్ర రాకుంటే.. ఆ ఆసనం సాధన చేయవచ్చు. దీంతో ఒత్తిడి, టెన్షన్లు, నీరసం పోతాయి. త్వరగా నిద్రపోయేలా చేస్తుంది. పిల్లలు బోర్లా పడుకున్నట్టుగా ఈ ఆసనం ఉంటుంది. అందుకే ఇంగ్లిష్‍లో చైల్డ్ పోజ్ అంటారు.
బద్ధకోణాసనం వేయడం వల్ల శరీరం మొత్తం విశ్రాంతిగా ఫీల్ అవుతుంది. మెదడులో ప్రశాంతత ఏర్పడుతుంది. రాత్రివేళ నిద్ర బాగా పట్టేలా సహకరిస్తుంది. నిద్రలేమి సమస్య తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాన్ని సీతాకోక చిలుక ఆసనం అని కూడా పిలుస్తారు.
నిద్రలేమి సమస్యను సేతుబంధాసనం తగ్గించగలదు. దీన్ని బ్రిడ్జ్ (వంతెన) పోజ్ అని అంటారు. ఈ ఆసనంలో శరీరం వంతెనలా ఉంటుంది. దీంతో ఆ పేరు వచ్చింది. ఈ ఆసనం వేయడం వల్ల అలసట, ఆందోళన, ఒత్తిడి లాంటివి తగ్గిపోతాయి. వేగంగా నిద్రపట్టేందుకు ఈ ఆసనం సహకరిస్తుంది.