IND vs BAN 2nd Test Day 2: కాన్పూర్ టెస్టుకి మళ్లీ వర్షం అడ్డంకి, ఈరోజు కూడా ఆట కష్టమే!
Kanpur Test Updates: కాన్పూర్ టెస్టుని వరుణుడు వదిలేలా లేడు. శుక్రవారం కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా.. ఈరోజు ఆ ఓవర్లు కూడా కష్టమే అనేలా అక్కడ వర్షం పడుతోంది.
Kanpur Weather Report: భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకి మళ్లీ వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఆట ఆరంభానికి ముందే కాన్పూర్ స్టేడియం పరిసరాల్లో వర్షం పడుతోంది. దాంతో పిచ్‌తో పాటు మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. ఈరోజు మ్యాచ్ ఆలస్యంకానుంది.
శుక్రవారం కూడా వర్షంతో గంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ టీమ్..తొలి రోజు ఆట ముగిసే సమయానికి 107/3తో నిలిచింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (6 బ్యాటింగ్: 13 బంతుల్లో 1x4), మొమినల్ హక్ (40 బ్యాటింగ్: 81 బంతుల్లో 7x4) ఉన్నారు.
తొలి రోజు 35 ఓవర్ల ఆట
వెలుతురులేమి కారణంగా శుక్రవారం ఆటని రెండు గంటలు ఉండగానే అంపైర్లు నిలిపివేశారు. దాంతో తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం కారణంగా పిచ్ ఫాస్ట్ బౌలర్లకి కలిసొస్తుందని భావించిన కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని నమ్మకాన్ని నిలబెడుతూ యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్ (0), సదామన్ ఇస్లాం (24) వికెట్లను పడగొట్టాడు.
చాలా సేపు క్రీజులో ఉన్న బంగ్లా కెప్టెన్ శాంటో (31: 57 బంతుల్లో 6x4)ని అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఈరోజు తొలి సెషన్‌లోనూ బౌలర్లకి కలిసొచ్చేది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ జరిగే సూచనలు కనిపించడం లేదు. మ్యాచ్ సమయానికే స్టేడియానికి చేరుకున్న ప్లేయర్లు, అంపైర్లు నిరీక్షిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలో కనిపించడం లేదు.
వర్షంపై అక్యూవెదర్ రిపోర్ట్
అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు (సెప్టెంబర్ 28)కాన్పూర్‌లో 80 శాతం వర్షం పడే సూచనలు ఉన్నాయి. మ్యాచ్ జరిగే సమయంలోనూ పలు మార్లు వర్షం పడే అవకాశం ఉందని ఆ రిపోర్ట్‌లో ఉంది. దాంతో రెండో రోజు కూడా ఆట సాఫీగా సాగడంపై సందేహాలు నెలకున్నాయి. ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల ఈ సిరీస్‌లో 1-0తో లీడ్‌లో ఉంది.