IND vs BAN 2nd Test Updates: మ్యాచ్ టైమ్‌లో ఈరోజు కాన్పూర్‌లో వర్షం పడే శాతం ఎంత? డీటైల్ రిపోర్ట్
Kanpur Weather Report: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టుకి తొలిరోజు పదే పదే అంతరాయం కలిగించిన వరుణుడు రెండో రోజూ కూడా వదిలేటట్లు కనిపించడం లేదు. శనివారం మ్యాచ్ సమయంలో వర్షం పడే శాతం గంట గంటకీ ఎలా మారుతోందంటే?
India vs Bangladesh 2nd Test: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకి రెండో రోజూ వరుణుడు ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌లో తొలి రోజైన శుక్రవారం టాస్‌తో పాటు గంట ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. ఈరోజు కూడా ఆట సాఫీగా జరిగే సూచనలు కనిపించడం లేదు.
తొలి రోజు 35 ఓవర్లకే పరిమితం
తొలి రోజైన శుక్రవారం కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ టీమ్ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో మొమినల్ హక్ (40 బ్యాటింగ్: 81 బంతుల్లో 7x4), ముష్ఫికర్ రహీమ్ (6 బ్యాటింగ్: 13 బంతుల్లో 1x4) ఉన్నారు.
శుక్రవారం ఆటకి వరుణుడు పదే పదే అంతరాయం కలిగించాడు. చివరికి కాన్పూర్ స్టేడియం పరిసరాల్లో శుక్రవారం మధ్యాహ్నానికే వెలుతురు సరిగా లేకపోవడంతో తొలి రోజు ఆటను చాలా ముందుగానే అంపైర్లు ముగించారు. దాంతో శనివారం కాన్పూర్‌లో వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు.
భారత్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ టీమ్‌లో ఓపెనర్లు జాకీర్ హసన్ (0), సదామన్ ఇస్లాం (24), కెప్టెన్ శాంటో (31) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఇటీవల చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఉదయం నుంచే వర్షం షురూ
అక్యూవెదర్ నివేదిక ప్రకారం శనివారం (సెప్టెంబర్ 28) కూడా కాన్పూర్‌లో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది ఒకింత క్రికెట్ ప్రేమికులకు నిరాశపరిచే వార్తే. మ్యాచ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం 51 శాతం ఉందని.. శుక్రవారం తరహాలో మ్యాచ్ ఆరంభానికి కూడా వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు ముగియాలి. కానీ.. అక్యూవెదర్ నివేదిక ప్రకారం ఈ మ్యాచ్ సమయంలో వర్ష సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
మ్యాచ్ సమయంలో వర్షం పడే శాతం
ఉదయం 9 గంటలకి - 51 శాతం వర్షం పడే అవకాశం
10 గంటలకి - 51 శాతం వర్షం పడే అవకాశం
11 గంటలకి - వర్షం పడే అవకాశం 47 శాతం
మధ్యాహ్నం 12 గంటలు - వర్షం పడే అవకాశం 40 శాతం
మధ్యాహ్నం 1 గంటకి - వర్షం పడే అవకాశం 34 శాతం
మధ్యాహ్నం 2 గంటలకి - వర్షం పడే అవకాశం 34 శాతం
సాయంత్రం 3 గంటలకి- వర్షం పడే అవకాశం 37 శాతం
సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వర్షం కురిసే అవకాశం 48 శాతం