AP State Toll Roads: ప్రైవేట్‌గానే స్టేట్ హైవేల నిర్మాణం.. తొలివిడతలో18 మార్గాల్లో హైవేల నిర్మాణం.. టోల్ వసూలు ఖాయం-construction of state highways with private partnership construction of highways on 18 routes in the first phase ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap State Toll Roads: ప్రైవేట్‌గానే స్టేట్ హైవేల నిర్మాణం.. తొలివిడతలో18 మార్గాల్లో హైవేల నిర్మాణం.. టోల్ వసూలు ఖాయం

AP State Toll Roads: ప్రైవేట్‌గానే స్టేట్ హైవేల నిర్మాణం.. తొలివిడతలో18 మార్గాల్లో హైవేల నిర్మాణం.. టోల్ వసూలు ఖాయం

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 26, 2024 07:07 AM IST

AP State Toll Roads: ఏపీలో ఇకపై స్టేట్‌ హైవేలపై టోల్‌ తప్పకపోవచ్చు. పబ్లిక్‌- ప్రైవేట్ భాగస్వామ్యంలో ముఖ్యమైన రాష్ట్ర రహదారుల్ని హైవేలుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో 18రోడ్లను గుర్తించారు. భవిష్యత్తులో మరిన్ని రోడ్లను పీపీపీ పద్ధతిలోనే విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

AP State Toll Roads: ఏపీలో రాష్ట్ర రహదారుల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారుల నిర్మాణం, గుంతలు పడిన రహదారులతో ప్రజల ఇక్కట్ల నేపథ్యంలో ఆర్‌ అండ్‌ బి రోడ్లపై ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయానికి వచ్చింది. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో స్టేట్ హైవేల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే జాతీయ రహదారుల తరహాలో స్టేట్ హైవేలను కూడా ప్రైవేట్ నిర్వహణకు అప్పగించి నిర్మించాలని, టోల్‌ గేట్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో మొత్తం 12,653 రాష్ట్ర హైవేలు ఉన్నాయని...వీటిలో 10,200 కి.మీ మేర పీపీపీ పద్దతిలో నిర్మాణం చేపట్టవచ్చని అంచనాకు వచ్చినట్లు ఆర్‌ అండ్‌ బి అధికారులు సమీక్షలో తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పీపీపీ పద్దతిలో రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్దం చేసినట్ల అధికారులు వివరించారు. రాష్ట్రంలో మొదటి ఫేజ్ కింద 18 రోడ్లును 1,307 కి.మీ మేర పిపిపి పద్దతిలో నిర్మించేందుకు నిర్ణయించారు. గుర్తించిన రోడ్లకు డీపీఆర్ లు తయారు చేసి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ విధానంలో DBFOT (design, build, finance, operate and transfer), BOT( buit operative transfer), HAM( hybrid annuity modal), TOT(toll, operate and transfer), OMT( operate maintain and transfer) వంటి విధానాల ద్వారా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

తొలి విడతలో టోలు తీసే మార్గాలు ఇవే…

పీపీపీ విధానంలో చిలకలపాలెం-రామభద్రపురం-రాయగడ, విజయనగరం-పాలకొండ, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం, భీమునిపట్నం -నర్సీపట్నం, కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్, ఏలూరు-మేడిశెట్టివారిపాలెం, నర్సాపురం-అశ్వారావుపేట, ఏలూరు-జంగారెడ్డిగూడెం, గుంటూరు-పర్చూరు, గుంటూరు-బాపట్ల, మంగళగిరి-తెనాలి-నారా కోడూరు, బేస్తవారిపేట-ఒంగోలు, రాజంపేట -గూడూరు, ప్యాపిలి-బనగానపల్లి, దామాజీ పల్లి-తాడిపత్రి, జమ్మలమడుగు -కొలిమిగుండ్ల, సోమందేపల్లి-హిందూపురం-తూముకుంట మధ్య మొత్తం 1,307 కి.మీ మేర పిపిపి విధానంలో రోడ్లు నిర్మించనున్నారు.

జాతీయ రహదారుల తరహాలోనే…

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ విధానంలో కొత్త రోడ్లను నిర్మిస్తారు. నేషనల్ హైవేలలో ఎలా అయితే పీపీపీ పద్దతికి ప్రజలు ఆమోదం తెలిపారో....మంచి రోడ్లు అందుబాటులోకి తెస్తే....స్టేట్ హైవేల విషయంలో కూడా అటువంటి స్పందనే వస్తుందని సిఎం అన్నారు. ఈ రోడ్లపై టోల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతో పాటు ఇంకా ఎవరికి మినహాయింపు ఇవ్వాలనేది కూడా చర్చించాలని చెప్పారు. కేవలం భారీ వాహనాలు, ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు మాత్రమే రుసుము వసూలు చేసే విధానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రజలపై భారం వేయకుండా.....రోడ్ల నిర్మాణ సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ప్రభుత్వం చెల్లిస్తుందని సిఎం అన్నారు. మంచి రోడ్లు, ప్రజలకు రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సిఎం చంద్రబాబు అన్నారు.

రూ.861 కోట్లతో రోడ్లకు మరమ్మతులు…

రాష్ట్రంలో రూ.861 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రోడ్లు కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నవంబర్ 2వ తేదీన అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులు సంక్రాంతి నాటికి పూర్తి కావాలని సిఎం ఆదేశించారు. మొక్కుబడిగా పనులు చేస్తే సహించేది లేదని....పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు. నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.

ప్రైవేటు సంస్థల ద్వారా రోడ్ల నాణ్యతపై నివేదికలు తెప్పించాలని సూచించారు. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా రోడ్ల మరమ్మతులు సమగ్రంగా జరగాలని సిఎం అన్నారు. 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చి బాగు చేసే పనులు జరుగుతున్నాయి. సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో ఈ పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

రాష్ట్రంలో మొత్తం 45,378 కి.మీ ఆర్ అండ్ బి రోడ్ నెట్ వర్క్ ఉండగా...అందులో 22,299 వేల కి.మీ మేర మరమ్మతులు చేయాల్సి ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.861 కోట్లతో ముమ్మరంగా మరమ్మతులు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 1,991 కి.మీ మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు అధికారులు వివరించారు. మరోవైపు 1,447 కి.మీ మేర రోడ్లు రిపేర్ చేయలేని స్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

వీటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు నిర్మించాల్సి ఉందని.....వీటికి రూ.581 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలపగా...ఆ నిధులు కూడా రానున్న రోజుల్లో మంజూరు చేస్తామని సిఎం తెలిపారు. 23,521 కి.మీ లో జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉందని....వీటికి రూ.33 కోట్లు ఖర్చు అవుతుందని....ఈ పనులు కూడా రానున్న రోజుల్లో చేపడతాం అని అధికారులు తెలిపారు.

ఎన్ డిబి పనులు వేగవంతం

రాష్ట్రంలో న్యూ డెవలెప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సిఎం సూచించారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన ఫేజ్ 1 పనుల్లో 666 కి.మీ మాత్రమే పూర్తి అయ్యాయని.....ఇవి మొత్తం పనుల్లో 26 శాతం మాత్రమే అని అధికారులు వివరించారు. మొదటి ఫేజ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యాలని సిఎం అధికారులకు తెలిపారు. ఇకపోతే రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితిపై కూడా సిఎం ఆరా తీశారు.

గ్రామాల్లో మొత్తం 68 వేల కి.మీ ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయని...వీటిలో 55 వేల కి.మీ సిసి రోడ్లు ఉన్నాయని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 25 వేల కి.మీ మేర సిసి రోడ్ల నిర్మాణం జరిగిందని...వైసీపీ ప్రభుత్వంలో కేవలం 6 వేల కి.మీ మేర మాత్రమే పనులు జరిగాయన్నారు. మిగిలిన సిసి రోడ్ల పనులను కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులు, నరేగా పనుల్లో భాగంగా పూర్తి చెయ్యాలని సిఎం సూచించారు. కేంద్రం తాజాగా మరో రూ.275 కోట్లు పంచాయతీలకు విడుదల చేసిందని..వాటి ద్వారా కూడా పనులు చేపట్టాలని సిఎం అన్నారు. నాబార్డు నిధుల ద్వారా పంచాయతీ రోడ్లు నిర్మించాలని సిఎం సూచించారు.

Whats_app_banner