Kanpur Mayor | ఓటేస్తూ ఫొటోలు, వీడియోలు.. కాన్పూర్ మేయర్‌పై ఎఫ్‌ఐఆర్
కాన్పూర్ నగర మేయర్ ప్రమీలా పాండే చిక్కుల్లో పడ్డారు. ఓటేస్తూ ఫొటోలు, వీడియోలు తీయడమే కాకుండా తాను ఓటేసిన ఈవీఎం ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఓటేసిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే.. తాను ఓటు వేసిన పోలింగ్ బూత్‌లో ఫొటోలు, వీడియోలు తీశారు. అంతేకాదు తాను ఓటేస్తున్న వీడియోతోపాటు ఓటేసిన ఈవీఎం ఫొటోను కూడా వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయడం గమనార్హం.
ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించింది. ఓటు రహస్యాన్ని బహిర్గతం చేసినందుకుగాను సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు.
మరో బీజేపీ నేత నవాబ్ సింగ్ కూడా పోలింగ్ బూత్‌తోపాటు తాను ఓటేస్తున్న వీడియోను తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. అయితే ఆయనపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యూపీలో మూడో విడతలో భాగంగా 59 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 627 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్‌లో ఫొటోలు, వీడియోలు తీయడం చట్టవిరుద్ధం.