Sabarimala: రక్తసంబంధీకులు మరణిస్తే ఏడాదిలోపు శబరిమల యాత్రకు వెళ్ళవచ్చా?-can one go to sabarimala yatra within a year if blood relatives die ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sabarimala: రక్తసంబంధీకులు మరణిస్తే ఏడాదిలోపు శబరిమల యాత్రకు వెళ్ళవచ్చా?

Sabarimala: రక్తసంబంధీకులు మరణిస్తే ఏడాదిలోపు శబరిమల యాత్రకు వెళ్ళవచ్చా?

Haritha Chappa HT Telugu
Published Nov 26, 2024 10:00 AM IST

Sabarimala: ప్రతి ఏడాది శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే కొన్నిసార్లు ఇంట్లో రక్తసంబంధీకులు మరణించిన సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో శబరిమల యాత్ర చేయవచ్చా?

అయ్యప్ప దీక్ష ఎప్పుడు తీసుకోకూడదు?
అయ్యప్ప దీక్ష ఎప్పుడు తీసుకోకూడదు?

అయ్యప్ప దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయ్యప్పను ధర్మ శాస్తా, మణికందన్ అని కూడా పిలుస్తారు. హిందూ శాస్త్ర ప్రకారం అతడు మోహిని రూపంలో విష్ణువు, శివుడుకు పుట్టిన కుమారుడిగా చెప్పుకుంటారు. అంతేకాదు శైవ మతానికి, వైష్ణవ మతానికి మధ్య వారధిగా గుర్తిస్తారు. క్షీరసాగరంమధనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీమహావిష్ణువు మోహినిగా అవతారం ధరిస్తారు. ఆ సమయంలోనే మోహినికి, శివునికి అయ్యప్ప జన్మించారనే చెప్పుకుంటారు. ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే అయ్యప్ప మాలను ధరించే వారికి కొన్ని రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇంట్లో ఎవరైనా రక్తసంబంధీకులు చనిపోతే ఏడాదిలోపు అయ్యప్ప మాల వేయవచ్చా? శబరిమల యాత్రకు వెళ్ళవచ్చా? అనే అనుమానాలు ఉన్నాయి.

ఏడాది పాటూ మాల వేయకూడదా?

పూర్వం పిండ ప్రధానం కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత దేవాలయాలను సందర్శించేవారు. హిందూ ఆచారాల ప్రకారం కార్తీకమాసం నుంచి మకర సంక్రాంతి మధ్య ఈ అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు లేదా సోదరులు, సోదరీమణులు ఇలా దగ్గర రక్తసంబంధీకులు మరణిస్తే మాత్రం వారు ఏడాది పాటు మాలని వేసుకోకూడదు అని చెబుతారు. అలాగే భార్య మరణిస్తే మాత్రం ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షను తీసుకోకూడదని, మాలను ముట్టుకోకూడదు అని అంటారు. దీన్ని బట్టి అయ్యప్ప దీక్ష లేదా అయ్యప్ప మాల వేసుకోవాలనుకునేవారు నిర్ణయాన్ని తీసుకోవాలి.

భార్య గర్భవతిగా ఉంటే

అంతేకాదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడా భర్త శబరిమలకు వెళ్ళకూడదని చెబుతారు. ఒక స్త్రీ సంతానోత్పత్తికి పురుషుడు కూడా ప్రధాన కారణం. కాబట్టి వారి ఉమ్మడి ప్రయత్నం ద్వారానే స్త్రీ గర్భవతి అయింది. ఇది ఇద్దరికీ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి భార్య గర్భవతి అయితే భర్త కూడా అయ్యప్ప దీక్షను తీసుకోకూడదు.

శబరిమల వెళ్లేందుకు కేవలం మగవారికి, పదేళ్ల వయసులోపు ఆడపిల్లలకు, 60 ఏళ్లు దాటిన మహిళలకు వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయ్యప్ప పూర్తి బ్రహ్మచారి కాబట్టి పునరుత్పత్తి వయసులో ఉన్న స్త్రీలు, బాలికలు అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి శబరిమల రావడానికి వీలులేదని నిషేధం విధించారు.

నలుపు రంగు దుస్తులే ఎందుకు?

అయ్యప్ప మాల ధరించిన వారు కేవలం నలుపు రంగు వస్త్రాలను మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఈ రంగు భౌతిక సుఖాల నుంచి దూరంగా ఉంచుతుందని చెబుతారు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, ముఖం మీద ఉన్న మీసాలను, గెడ్డాలను షేవింగ్ చేసుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, చెప్పులు వేసుకోవడం అన్నీ నిషేధమే. కనీసం తలను కూడా దువ్వెనతో దువ్వుకోకూడదు. అయ్యప్ప స్వామికి ఇష్టమైన రంగు నలుపు రంగు. అందుకే ఆయన దీక్ష తీసుకున్న వారు నలుపు రంగు దుస్తులనే ధరించి 41 రోజులపాటు పూజలు చేస్తారు. ఆయన ఆలయాన్ని సందర్శించాకే నలుపు వస్త్రాలను త్యజిస్తారు.

అయ్యప్ప స్వామికి తులసి మొక్కలు నీలిరంగులో ఉండే శంఖ పుష్పాలు అంటే ఎంతో ఇష్టం. అయ్యప్పను పూజించేటప్పుడు మీరు ఈ పుష్పాలతో పూజ చేస్తే మంచి ఫలితాలు తొక్కుతాయి. అలాగే గులాబీలు, బంతిపూలు, మల్లె పువ్వులతో కూడా పూజలు చేయవచ్చు. కానీ నీలిరంగు శంఖంపూలతో పూజ చేస్తే అయ్యప్ప మరింత సంతోషిస్తాడని చెప్పుకుంటారు.

Whats_app_banner