Utpanna Ekadashi 2024: ఈరోజు ప్రతిఒక్కరూ కచ్చితంగా చదవాల్సిన ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఇది-utpanna ekadashi vrata katha is a must read for everyone today ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Utpanna Ekadashi 2024: ఈరోజు ప్రతిఒక్కరూ కచ్చితంగా చదవాల్సిన ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఇది

Utpanna Ekadashi 2024: ఈరోజు ప్రతిఒక్కరూ కచ్చితంగా చదవాల్సిన ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఇది

Haritha Chappa HT Telugu
Nov 26, 2024 09:19 AM IST

Utpanna Ekadashi 2024: మార్గశిర్ష కృష్ణ పక్షం ఏకాదశి రోజును ఉత్పన్న ఏకాదశి పండుగను నిర్వహించుకుంటారు. ఆ రోజు కచ్చితంగా చదవాల్సిన ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఒకటుంది. వ్రత కథను పఠించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి వ్రత కథ గురించి మరింత చదవండి.

ఉత్పన్న ఏకాదశి వ్రత కథ
ఉత్పన్న ఏకాదశి వ్రత కథ

మార్గశిర్ష కృష్ణ పక్షం ఏకాదశి తిథిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని చెప్పుకుంటారు. ఈ రోజున ఏకాదశి మాత జన్మించింది. అందుకే ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఏకాదశి ఉపవాస దీక్షను ప్రారంభించాలనుకునే భక్తులు ఉత్పన్న ఏకాదశి నుంచే ప్రారంభించాలి. ఈ ఉపవాసం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితాలను అందిస్తుంది. ఈ ఏడాది నవంబర్ 26న ఉత్పన్న ఏకాదశి వస్తోంది. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆ తర్వాత విష్ణువును, ఏకాదశి మాతను పూజించాలి. దీపదానం, అన్నదానం చేస్తారు. ఈ రోజున చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఏకాదశి వ్రత పఠించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

ఉత్పన్న ఏకాదశి వ్రతం కథ

సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు, భయంకరమైనవాడు. ఆ భీకర రాక్షసుడు ఇంద్రుడు, ఆదిత్యుడు, వాసు, వాయువు, అగ్ని మొదలైన దేవతలందరినీ ఓడించి తరిమికొట్టాడు. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలందరూ భయపడి శివునికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు "దేవతలారా! త్రిలోకాలకు అధిపతి అయిన విష్ణువు సన్నిధికి వెళ్లి మీ బాధను చెప్పండి. ఆయన మాత్రమే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని చెప్పాడు.

శివుని మాటలు విని దేవతలందరూ క్షీర సాగరం వద్దకు చేరుకుని, "హే! మధుసూదన, మమ్మల్ని రక్షించండి. రాక్షసులు మమ్మల్ని జయించారు, మాలోకం నుండి బహిష్కరించారు’ అంటూ మొర పెట్టుకున్నారు. ఇంద్రుని మాటలు విన్న మహావిష్ణువు దేవతలందరినీ జయించిన ఆ రాక్షసుడు ఎవరో, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగాడు.

ఇంద్రుడు, "స్వామీ! మురా అనే రాక్షసుడు ఉన్నాడు, అతను చాలా శక్తిమంతుడు. ఇతనికి చంద్రావతి అనే పట్టణం ఉంది. దేవతలందరినీ స్వర్గం నుండి బయటకు పంపి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, వాయువు, ఈశ్వరుడు, చంద్రుడు, నైతుడు మొదలైన వారి స్థానాన్ని ఆక్రమించాడు. ఆ దుర్మార్గుడిని చంపి దేవతలను కాపాడండి’ అని వేడుకున్నాడు.

ఈ మాట విన్న విష్ణువు త్వరలోనే అతడిని చంపుతాను అని చెప్పాడు. అందరూ చంద్రావతి నగరానికి వెళదాం పదండి అని ఆదేశించాడు. ఇలా చెప్పి విష్ణువుతో సహా దేవతలందరూ చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఆ సమయంలో ఆ రాక్షసుడు మురా సైన్యంతో యుద్ధభూమిలో గర్జిస్తున్నాడు. భగవంతుడే స్వయంగా యుద్ధభూమికి రావడంతో రాక్షసులంతా ఆయుధాలతో అతని వైపుకి పరిగెత్తారు.

అప్పుడు విష్ణువు తన బాణాలతో ఎందరో రాక్షసులు హతమార్చాడు. మురా ఒక్కడే మిగిలాడు. అతను ఆగకుండా దేవునితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. విష్ణువు ఏ పదునైన బాణం వేసినా అది అతనికి పుష్పంలాగా తాకుతోంది. అతని శరీరం నిండా గాయాలు ఉన్నా కూడా పోరాటం కొనసాగించాడు. వారిద్దరి మధ్య యుద్ధం 10,000 సంవత్సరాలు కొనసాగింది, కానీ మురా ఓడిపోలేదు.

అలసిపోయిన విష్ణువు బద్రీకాశ్రమానికి వెళ్ళాడు. హేమవతి అనే అందమైన గుహ అక్కడ ఉంది. అందులో భగవంతుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రవేశించాడు. పన్నెండు యోజనాల పొడవున్న ఈ గుహకు ఒకే ఒక ద్వారం ఉంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకున్నాడు.

మురా విష్ణువును వెతుక్కుండూ అక్కడికి వచ్చాడు. నిద్రపోతున్న ప్రభువును చూసి, అతడిని చంపడానికి సిద్దమయ్యాడు. అప్పుడే ప్రకాశవంతమైన రూపం కలిగిన దేవత విష్ణువు శరీరం నుండి వికసించింది. ఆ దేవత మురా అనే రాక్షసుడిని ఎదిరించి, పోరాడి అతడిని చంపింది. శ్రీ హరి నిద్ర నుండి లేచి అన్ని విషయాలు తెలుసుకొని, నువ్వు ఏకాదశి రోజున జన్మించావు కాబట్టి నిన్ను ఉత్పన్న ఏకాదశి పేరుతో పూజిస్తారని ఆ దేవతతో చెప్పాడు. నా భక్తులంతా నీ భక్తులే. వారు నిన్ను నాతో సమానంగా పూజిస్తారు అని చెప్పాడు. ఆమెనే ఏకాదశి దేవతగా చెప్పుకుంటారు.

Whats_app_banner