Hyderabad : మూసీలో రసాయన పరిశ్రమల వ్యర్థాల డంపింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు
Hyderabad : మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం.. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. మూసీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారు. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. మూసీలో రసాయన పరిశ్రమల వ్యర్థాలను డంప్ చేయడం కలకలం సృష్టిస్తోంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూఘాట్ వద్ద సోమవారం రాత్రి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ లారీ డ్రైవర్ రసాయన పరిశ్రమల వ్యర్థాలను మూసీ నదిలో వేయడానికి ప్రయత్నించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూసీ పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతోంది. ఈ నేపథ్యంలో రసాయన వ్యర్థాలను మూసీలో డంప్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. లారీ డ్రైవర్ పారిశ్రామిక వ్యర్థాలతో బాపూఘాట్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే కలుషితమైన వ్యర్థాలను ఆఫ్‌లోడ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు అడ్డుకున్నారు. డ్రైవర్‌ను నిలదీశారు. అప్పటికే పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు.
ఇలాంటి పనులు మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరుస్తాయని.. స్థానికులు చెబుతున్నారు. పర్యావరణం, ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఇలాంటి అక్రమ డంపింగ్‌కు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం యజమానిని గుర్తించి పారిశ్రామిక వ్యర్థాలపై కూపీ లాగాలని ప్రయత్నిస్తున్నారు.
బాపూఘాట్ నుంచే..
మూసీలో మొదట దశలో బాపూఘాట్ నుంచి ఎగువకు 21 కి.మీ మేర ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 5 కన్సల్టెన్సీ సంస్థల కన్సార్షియం మూసీ పునరుజ్జీవం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను రూపొందిస్తోందన్నారు. ఈ పనిని రూ.141 కోట్లతో అప్పగించిననట్లు వెల్లడించారు. డిజైన్, డ్రాయింగులు, నిర్మాణాలు ఇలా అన్నీ కన్సల్టెన్సీ సంస్థలే తయారు చేస్తాయని చెప్పారు.
మూసీ పునరుజ్జీవం ఫస్ట్ ఫేజ్‌లో బాపూఘాట్ నుంచి ఎగువ భాగంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవల వివరించారు. జంట నగరాల నీటి అవసరాలు తీర్చే ఉస్మాన్‌సాగర్ నుంచి 11.5 కి.మీ. దూరం, హిమాయత్‌సాగర్ నుంచి 9.5 కి.మీ. దూరం మంచి నీరు ప్రవహించి బాపూఘాట్ వద్ద కలుస్తాయని చెప్పారు. అ ప్రాంతంలో ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.