TG Weather Update : చంపేస్తున్న చలి.. నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-meteorological department warns that the cold wave is likely to intensify further in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Weather Update : చంపేస్తున్న చలి.. నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG Weather Update : చంపేస్తున్న చలి.. నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG Weather Update : చలితో తెలంగాణ గజగజ వణికిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 4 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

చంపేస్తున్న చలి

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరిత తగ్గాయి. నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 8.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.8 డిగ్రీలు నమోదయింది. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, జిల్లాల్లోని పలు మండలాల్లో 11 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ లోని చాలా జిల్లాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.

వృద్ధులు జాగ్రత్త..

చలికాలంలో వృద్ధులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణంలో కీళ్లనొప్పులు పెరుగుతాయని.. వైరల్‌ ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. వృద్ధులకు రక్త ప్రసరణ మందగించి గుండె జబ్బులు పెరిగే ప్రమాదముంది. ఈ సమయంలో వేడినీళ్లు తాగాలని సూచిస్తున్నారు.

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ..

చలికాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ కాలంలో చిన్నారులకు జలుబు, దగ్గు, జర్వం లాంటివి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే పిల్లలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చలికాలంలో వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

పిల్లలను చలి నుంచి రక్షించి వారి శరీరం వెచ్చగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఉన్ని స్వెటర్లు తప్పనిసరిగా వేయాలి. చలితీవ్రత ఎక్కువగా ఉండే చేతులకు గ్లవ్స్, కాళ్లకు సాక్స్ వేయాలి. బయటికి వెళితే షూ వేయాలి. పిల్లల శరీరానికి నేరుగా చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. పిల్లల శరీరంలో వెచ్చదనం తగ్గితే జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.