Vote From Home : తెలంగాణలో మొదలైన పోలింగ్- ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
Vote From Home : తెలంగాణ ఎన్నికల్లో వికలాంగులు, వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. పలు జిల్లాల్లో వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Vote From Home : ఈసారి ఎన్నికల్లో వికలాంగులు, వృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వేసులు బాటు కల్పించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, నడవలేని వికలాంగులకు ఎన్నికల అధికారి సమక్షంలో ఓటేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధులు, వికలాంగులు
సిద్ధిపేట జిల్లా దౌలతాబాద్ మండలం లింగరాజుపల్లి గ్రామంలో 80 ఏళ్లు దాటిన రాజయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మరో 28 మంది ముందుగా దరఖాస్తు చేసుకోగా అందులో 21 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగుల ఇంటి దగ్గరకే బ్యాలోట్ బాక్స్, ఈవీఎం సహ ఎన్నికల సామగ్రిని తరలించి సిద్ధిపేట జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఓటు హక్కును వారికి కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా 28,057 మంది ఇంటి నుంచే ఓటు
కాగా గతంలో వృద్ధులు, నడవలేని వికలాంగులు ఓటు వేయాలంటే వీల్ చేర్స్, ప్రత్యేక వాహనాలు రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయలేని వారు నేరుగా ఫారం డి-12 ను సమర్పిస్తే ఇంటి నుంచే ఓటేసేందుకు ఎన్నికల అధికారికి బిఎల్ఓ సిఫార్సు చేస్తారు. ఇంటికి వచ్చే ముందు పోలింగ్ సిబ్బంది ఓటర్ కు సమాచారం అందిస్తారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయో వృద్ధులు, వికలాంగులు ఓటును వేస్తారు. అక్కడ నుంచి నేరుగా సిబ్బంది పోలింగ్ బూత్ కు తరలిస్తారు. రాష్ట్రంలో మొత్తం 28,057 మంది వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్