AP Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్-andhra pradesh state wine dealers association sensational decision on margin issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్

AP Wine Shops : ఇలాగైతే వైన్స్ బండి నడిచేదెలా.. ట్విస్ట్ ఇచ్చిన వైన్ డీలర్స్ అసోసియేషన్

Basani Shiva Kumar HT Telugu
Nov 26, 2024 10:51 AM IST

AP Wine Shops : ఏపీలో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. అటు సర్కారు ఇస్తానన్న మార్జిన్ ఇవ్వడం లేదు. దీంతో డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైన్ షాపు
వైన్ షాపు

మద్యం వ్యాపారంపై 20 శాతం మార్జిన్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు నూతన మద్యం విధానం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ.. 10 శాతం మాత్రమే మార్జిన్ చెల్లిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం 10 శాతం మార్జిన్ చెల్లించడంతో.. వ్యాపారం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్జిన్ 20 శాతం చెల్లించని కారణంగా.. వ్యాపారంలో నష్టపోతున్నామని వైన్ డీలర్స్ చెబుతున్నారు. ఫలితంగా లైసెన్సు రుసుములు చెల్లించలేకపోతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా విజయవాడలో వైన్ డీలర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్జిన్ ఇష్యూపై ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

సమస్య పరిష్కారం కాకపోతే.. నూతన మద్యం విధానం ఉత్తర్వుల ప్రకారం హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇష్యూ ప్రైస్‌పై 20 శాతం మార్జిన్‌ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇష్యూ ప్రైస్‌ అనేదానికి అర్థం మార్చేసిందని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.టీసీఎస్‌, రౌండ్‌ ఆఫ్‌, డ్రగ్‌ కంట్రోల్‌ సెస్‌ కూడా ఇష్యూ ప్రైస్‌ కాకుండా విధిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

ఏపీలో గతంతో పోలిస్తే భారీగా లైసెన్స్‌ ఫీజులు పెంచారు. మార్జిన్‌ 20 శాతం చేసినందున లైసెన్స్‌ ఫీజులు పెంచారని వ్యాపారులు మొదట్లో భావించారు. కానీ.. చెప్పినదాంట్లో సగమే వస్తుండటంతో ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అటు వ్యాపారం కూడా ఆశించిన స్థాయిలో లేదని.. తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వచ్చిన లాభాలు వడ్డీలకు సరిపోవడం లేదని అంటున్నారు.

ఏపీలో చాలాచోట్ల మద్యం షాపులకు టెండర్లు వేసిన వారు బయట నుంచి అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టారు. ఉదాహరణకు.. తక్కువ వడ్డీకి తీసుకొచ్చినా.. లక్షలకు రెండు రూపాయలు ఉంటుంది. తక్కువలో తక్కువ రూ.20 లక్షల వరకు అప్పులు చేసిన షాపులు పెట్టిన వారు ఎందరో ఉన్నారు. ఆ అప్పునకు నెలకు రూ.40 వేలు వడ్డీ అవుతుంది. ఆ వడ్డీ, సిబ్బంది జీతాలు, షాపు నిర్వహణ ఖర్చులు.. అన్నీ కలిపి నెలకు లక్ష రూపాయలకు వరకు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Whats_app_banner