Vijayawada Floods : సందెట్లో సడేమియా.. విజయవాడ వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకుల చేతివాటం
Vijayawada Floods : ఓవైపు భారీ వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మరోవైపు వరద బాధితులు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యాపారులు, ప్రైవేట్ బోట్ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పంపిన ఆహార పధార్థాలను సేకరించి అమ్ముతున్నారు.
విజయవాడ సింగ్‌నగర్‌లో వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకుల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి ప్రజలకు అమ్ముతున్నారు. శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్లి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పంపిణీలో అధికారుల పర్యవేక్షణ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం పంపిణీ చేయలేదని.. బాధితులు ఆరోపిస్తున్నారు. బ్లాక్‌లో ఆహారం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని బాధితులు వాపోతున్నారు.
ఒకేసారి 5 లక్షల మందికి..
విజయవాడ వరద బాధితుల కోసం యుద్ధప్రాతిపదికన ఆహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకేసారి 5 లక్షల మందికి అక్షయపాత్ర భోజనం సిద్ధం చేస్తుంది. మంగళగిరి అక్షయపాత్రలో సిబ్బంది ఆహారం సిద్ధం చేస్తున్నారు. ఆహారం అందక ఎవరూ బాధపడకూడదని అక్షయపాత్ర ఈ నిర్ణయం తీసుకుంది.
20 వేల పులిహోర ప్యాకెట్లు..
విజయవాడ వరద బాధితులకు సింహచలం నుంచి పులిహోర ప్రసాదం పంపించారు. 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటికే రైలులో 10 వేల ప్యాకెట్లను ఆలయ అధికారులు విజయవాడకు పంపారు. మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు 10 వేల పులిహోర ప్యాకెట్లు చేరాయి.
తప్పిన అమావాస్య గండం..
అమావాస్య గండం నుంచి బెజవాడ గట్టెక్కుతుంది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 8.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 18 గంటల్లో రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది. వరద మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు పలు కాలనీలు వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
రెండ్రోజుల తర్వాత..
వరదల్లో చిక్కుకుని రెండు రోజుల తర్వాత తిరిగి కలుసుకున్నారు తండ్రీకొడుకులు. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయవాడ సింగ్ నగర్‌లో వరదల్లో తప్పిపోయి.. రెండు రోజుల తర్వాత తండ్రీకొడుకులు కలుసుకున్నారు. ఇలాంటి భవోద్వేగ ఘటనలు ఎన్నో జరిగాయి. అటు సింగ్ నగర్‌లో ఇంకా వరద కష్టాలు తీరలేదు. అనేక ఇళ్లు, అపార్ట్‌మెంట్లు వరద నీటిలోనే ఉన్నాయి. ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.