Ram Gopal Varma: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కి సిద్ధమైన ఒంగోలు పోలీసులు.. విచారణకి డుమ్మా కొట్టి వింత ప్రతిపాదన
Director Ram Gopal Varma Case: ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చుట్టూ ఉచు బిగిస్తోంది. ఇప్పటికే అతడ్ని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కి ఒంగోలు పోలీసులు వెళ్లగా..?
Director RGV Police Case: సీనియర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలకి ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతరకర పోస్టులను రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఇటీవల ఒంగోలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం రాంగోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చిన ఒంగోలు పోలీసులు.. విచారణకి పిలిచారు.
ముందస్తు బెయిల్‌కి నో
కానీ.. విచారణకి హాజరయ్యేందుకు తొలుత నిరాకరించిన రాంగోపాల్ వర్మ.. 4 రోజులు గడువు అడిగారు. అలానే అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే.. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. దాంతో రాంగోపాల్ వర్మ అరెస్ట్ తప్పదని జోరుగా నాలుగు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.
ఫస్ట్ ఎంక్వైరీకి డుమ్మా.. 4 రోజులు పర్మీషన్
వాస్తవానికి రాంగోపాల్ వర్మ నవంబరు 19న ఒంగోలు పోలీసుల ముందు విచారణకి హాజరు కావాల్సి ఉంది. కానీ.. షూటింగ్, వ్యక్తిగత పనుల కారణంగా 4 రోజులు సమయం కావాలని కోరారు. అందుకు అనుమతించిన ఒంగోలు పోలీసులు.. నవంబరు 25న (సోమవారం) ఉదయం విచారణకి రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. కానీ.. సోమవారం ఉదయం ఆర్జీవీ విచారణకి డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కి ఒంగోలు పోలీసులు వెళ్లారు.
కోయంబత్తూర్‌లో ఆర్జీవీ?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్లిన ఒంగోలు పోలీసులకి.. అక్కడ ఆయన కనిపించలేదు. ప్రస్తుతం ఆర్జీవీ కోయంబత్తూరులో షూటింగ్‌లో ఉన్నారని పోలీసులకి ఇంట్లోని సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో.. కోయంబత్తూరుతో పాటు ముంబయికి కూడా ఒంగోలు పోలీసు బృందాలు వెళ్లాయి.
కోయంబత్తూరులో సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఒంగోలుకి రాలేకపోతున్నానని పోలీసులకి తన లాయర్ ద్వారా తెలియజేసిన రాంగోపాల్ వర్మ.. వర్చువల్‌గా విచారణకి హాజరయ్యేందుకు అనుమతి కోరారు.
హైదరాబాద్‌లోని ఫాం హౌస్‌లపై పోలీసులు దృష్టి
కానీ.. ఒంగోలు పోలీసులు వర్చువల్ విచారణకి నిరాకరించినట్లు తెలుస్తోంది. దాంతో ఆర్జీవీ అరెస్ట్ లాంఛనంగానే కనిపిస్తోంది. షూటింగ్ కోసం ఆర్జీవీ కోయంబత్తూరు వెళ్లినట్లు సిబ్బంది చెప్తున్నా.. అతని సోషల్ మీడియా హ్యాండిల్స్ యాక్టివిటీ మాత్రం హైదరాబాద్ పరిసరాల్లో చూపిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. దాంతో హైదరాబాద్‌లోని ఫాం హౌస్‌లపై కూడా ఒంగోలు పోలీసులు దృష్టి సారించారు.
టాపిక్