Amaravati Capital Status: అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తించేలా చర్యలు… జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని
Amaravati Capital Status: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్2తో పూర్తైన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు.
Amaravati Capital Status: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటు లో కేంద్రం గతంలోనే స్పష్టం గా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని గడువు జూన్2తో ముగిసిపోయింది. దానిని పొడిగించడం, యథాతథ స్థితిని కొనసాగించడం వంటి నిర్ణయాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అమరావతి రాజధానిపై స్పష్టత కొరవడింది.
ఏపీ రాజధానిగా అమరావతిని దాదాపు పదేళ్ల క్రితం ఖరారు చేశారు. 2019 వరకు దాదాపు రూ.10వేల కోట్లను రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం నిలిపివేశారు. పరిపాలన రాజధాని నగరాన్ని విశాఖపట్నం మార్చాలని భావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలతో పాటు పెట్టుబడిదారుల్లో కూడా స్పష్టత కొరవడింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు గడుస్తున్న అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడంతో భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నారు.
అమరావతి చుట్టూ అవరోధాలు…
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అదే ఏడాది చివరిలో గుంటూరు-విజయవాడ మధ్య కృష్ణా తీరంలో ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభించి రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభించారు. భూసేకరణ, ప్రభుత్వ భూములు, రైతుల నుంచి సమీకరించిన భూములతో కలిపి దాదాపు 51వేల ఎకరాల విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. 2019నాటికి దాదాపు రూ.10వేల కోట్ల రుపాయలను అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.
2019జూన్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అమరావతిని తొలగించారు. రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థను అమరావతి ప్రాంతానికి పరిమితం చేశారు. ఈ మేరకు అమరావతి పరిధి, విస్తృతిని కుదిస్తూ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్ట సవరణలు చేసింది.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కాకుండా పరిపాలన రాజధానిని విశాఖపట్నంకు, శాసన వ్యవస్థను అమరావతికి, న్యాయవ్యవస్థను కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై దాదాపు మూడేళ్ల పాటు రకరకాల వివాదాలు, న్యాయపోరాటాలు జరిగాయి. చివరకు ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలను కొలిక్కి తెచ్చేందుకు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది.
ఏపీలో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు సమీపిస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతల్లో అసెంబ్లీ సమావేశాలు, నాలుగు సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. వీటిలో అమరావతి అంశం తెరపైకి రాలేదు. 2024 జూన్2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోయింది. అమరావతి భౌగోళిక పరిధిని పూర్వపు స్థితికి తీసుకు వచ్చే ప్రక్రియ కూడా జరగలేదు.
కేంద్రం వైఖరి ఏమిటి…?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి ముగింపు పలకాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఈ ఏడాది దాదాపు రూ.15వేల కోట్ల రుపాయలను అంతర్జాతీయ సంస్థల ద్వారా రుణంగా ఇప్పించేందుకు కేంద్రం గ్యారంటీ ఇస్తోంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీ రాజధానిని నోటిఫై చేయాలనే షరతు విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ద్వారా విడుదలయ్యే నిధులకు రాజధాని నగరాన్ని నోటిఫై చేయాలనే షరతు విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో టీడీపీ చేసిన చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం, వేల కోట్ల రుపాయల నిర్మాణాలను నిరుపయోగంగా మార్చి రాజధాని నిర్మాణంలో జాప్యం చేయడం వంటి అంశాలను కేంద్రం పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ వాటాగా రావాల్సిన షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజనను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
నార్మన్ ఫాస్టర్‌కే బాధ్యత…
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో నిర్మించే ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించింది. గత వైసీపీ ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్ ను, వారి డిజైన్లను రద్దు చేసిందిఅందుకే మళ్లీ ఈ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచాం, ఆ టెండర్లు కూడా నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయని తిరిగి అదే సంస్థకు టెండర్లు ఖరారు చేసినట్టు మంత్రి నారాయణ వివరించారు.
సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని తెలియచేశామని, త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయటంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ వేసిందని, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంలో వారికి 9 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా మళ్లీ రీటెండర్ పిలవాల్సి వచ్చిందని, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలు అవుతాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదు, దశలవారీగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందని, రాజధానికి సంబంధించి కేంద్రం నుంచి నోటిఫికేషన్ వస్తుందని మంత్రి నారాయణ చెబుతున్నారు.
సంబంధిత కథనం