AP Container Hospital : ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మన్యంలో కంటెయినర్‌ ఆసుపత్రి.. డోలీలకు స్వస్తి-ap government has made a container hospital available in vizianagaram district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Container Hospital : ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మన్యంలో కంటెయినర్‌ ఆసుపత్రి.. డోలీలకు స్వస్తి

AP Container Hospital : ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మన్యంలో కంటెయినర్‌ ఆసుపత్రి.. డోలీలకు స్వస్తి

AP Container Hospital : ఉత్తరాంధ్రలోని మన్యం ఆవాసాల్లో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా గర్భిణులను డోలీల్లో మోసుకుంటూ కొండల నడుమ ఆసుపత్రులకు తరలించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ కష్టాల్లోంచి వారిని గట్టెక్కించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

కంటెయినర్‌ ఆసుపత్రి

గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కంటెయినర్ ఆసుపత్రిని ఆందుబాటులోకి తెచ్చారు. మొదట పైలట్‌ ప్రాజెక్ట్‌గా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి కరడవలసలో.. 3 గదుల కంటెయినర్‌ ఆసుపత్రిని సిద్ధం చేశారు.

కొండపైనున్న కరడవలస గ్రామానికి సరైన దారి లేదు. దీంతో మైదాన ప్రాంతంలో తయారుచేసిన కంటెయినర్‌ను అక్కడికి తరలించేందుకు రూ.15 లక్షల వరకు వెచ్చించారు. ఈ కంటెయినర్‌లో వైద్యుడి గది, రోగులకు నాలుగు పడకలతో మరో గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. దీంట్లో 15 రకాల వైద్యపరీక్షలు చేయనున్నారు. ఇది 10 గ్రామాల గిరిజనులకు సేవలు అందిచనుంది.

దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 'పార్వతీపురం జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో.. కూటమి ప్రభుత్వం గిరి వైద్య కేంద్రాల పేరిట కంటెయినర్ ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది' అని టీడీపీ స్పష్టం చేసింది.

'అనార్యోగానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణులను డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు తీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత డోలి మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో, తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి గిరిశిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్‌ ఆస్పత్రిని నెలకొల్పారు. కంటైనర్‌ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు' అని టీడీపీ వెల్లడించింది.

ఈ కంటెయినర్ ఆసుపత్రి సేవలను పరిశీలించిన తర్వాత.. మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేని గ్రామాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మన్యంలో మరికొన్ని ప్రాంతాల్లో కంటెయినర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరికొన్ని అందుబాటులోకి వస్తే.. గిరిబిడ్డలకు కష్టాలు తప్పనున్నాయి.