Ys Jagan On Budget: చంద్రబాబు సూపర్ సిక్స్‌ హామీలు ఎక్కడంటే ..! బొంకులాడుతున్నాడని ఎద్దేవా చేసిన జగన్-jagan says chandrababu naidu is lying about super six promises ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan On Budget: చంద్రబాబు సూపర్ సిక్స్‌ హామీలు ఎక్కడంటే ..! బొంకులాడుతున్నాడని ఎద్దేవా చేసిన జగన్

Ys Jagan On Budget: చంద్రబాబు సూపర్ సిక్స్‌ హామీలు ఎక్కడంటే ..! బొంకులాడుతున్నాడని ఎద్దేవా చేసిన జగన్

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 20, 2024 03:59 PM IST

Ys Jagan On Budget: సూపర్‌ సిక్స్‌ హామీలు ఎక్కడంటే బొంకుల బాబు బొంకులాడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి అప్పులపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, కాగ్‌ రిపోర్టులు, బడ్జెట్‌ లెక్కల ఆధారంగా చంద్రబాబు అబద్దాలు బయటపడ్డాయని, హామీలు అమలు చేయలేక బొంకుతున్నారన్నారు.

చంద్రబాబు బొంకులాడుతున్నారని ఎద్దేవా చేసిన జగన్
చంద్రబాబు బొంకులాడుతున్నారని ఎద్దేవా చేసిన జగన్

Ys Jagan On Budget: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక పరిస్థితిపై అసలు వాస్తవాలు వెలుగు చూవాయని, బడ్జెట్‌ పెడితే అసలు లెక్కలు, సూపర్‌ సిక్స్‌, మోసాలు, అబద్దాలు బయటకు రాక తప్పదని, ఆర్థిక స్థితిపై అసలు పరిస్థితి బయటకు రాని పరిస్థితులు వస్తాయనే, ఇన్ని రోజులు బడ్జెట్‌ ప్రవేశ పెట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారని జగన్ ఆరోపించారు. చివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇంతవరకు చెప్పిన అబద్దాలు రుజువయ్యాయని చెప్పారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే అందులో నిజాలు బయటపెట్టినా చంద్రబాబులో మార్పు లేదని, బడ్జెట్‌ కేటాయింపులు గురించి సుదీర్ఘంగా చెప్పినా చంద్రబాబు నేనింతే , అబద్దాలు ఇలాగే చెప్పడానికి జస్టిఫికేషన్ కావాలనేలా అబద్దాలు కొనసాగించారని జగన్ ఆరోపించారు.

అసలు అప్పు రూ.6.64కోట్లు మాత్రమే..

రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయో బడ్జెట్ డాక్యుమెంట్‌లో చూపించక తప్పదని, బడ్జెట్‌ ప్రవేశపెడితే ఇది తప్పకుండా చేయాలన్నారు. చంద్రబాబు బడ్జెట్‌‌లో అప్పులు పేజీ 14,16 లలో ప్రస్తావించారని, రాష్ట్ర అప్పులు, 2018-19లో రూ. 2.57లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు చూపించారని, 16వ పేజీలో 2018-19లో ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చిన అప్పులు రూ.55వేలు కోట్లని వివరించారని, రూ.3.13లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు దిగి పోయే సమయానికి ఉన్నాయని వివరించారన్నారు.

2023-24 నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రూ. 4.84లక్షల కోట్లు, ప్రభుత్వ గ్యారెంటీలతో లక్షా 84వేల కోట్లు మొత్తం రూ. 6.46లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని బడ్జెట్‌లో పేర్కొన్నారని చెప్పారు. 2024లో ప్రభుత్వం మారేనాటికి రూ.6.46లక్షల కోట్ల అప్పులున్నాయని జగన్ చెప్పారు. కాగ్‌ నివేదికలో 2023-24నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే అప్పుగా నిర్దారించినట్టు వైసీపీ అధ్యక్షుడు జగన్ వివరించారు.

అప్పులపై అబద్దాల ప్రచారం…

ఏపీ అప్పులు రూ.11లక్షల కోట్లె, 12.5లక్షల కోట్లు, 14లక్షల కోట్లు అంటూ అప్పులపై తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు అనుకూల మీడియా దుష్ప్రచారం కొనసాగించారని, పద్దతి ప్రకారం తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.

కాగ్‌ ధృవీకరించిన అప్పును, ఐదు నెలలుగా అధికారంలో ఉంటూ చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించిన అప్పును కూడా వాళ్లే ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.6.46లక్షల కోట్ల అప్పులని బడ్జెట్‌లో చెప్పి, పది లక్షలని ఒకరు, వేర్వేరు లెక్కలని ఎందుకు చెబుతున్నారన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక లెక్క చెప్పి మరొకటి ఎందుకు చెబుతున్నారన్నారు.

సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు…

సూపర్‌ సిక్స్‌ హామీలు ఎందుకు ఇవ్వడం లేదో ఏపీ ప్రజలు అడుగుతారని బొంకుతున్నాడని, బొంకుల బాబు అని ఎందుకు అనకూడదో చెప్పాలని ప్రశ్నించారు.స్పిల్ ఓవర్ అకౌంట్స్, బిల్స్ ఉంటాయని, 2019లో చంద్రబాబు మిగిల్చి వెళ్లిన రూ. 42,183 కోట్ల బకాయిలను తాము చెల్లించినట్టు జగన్ చెప్పారు. ఆరోగ్య శ్రీ, విత్తన బకాయిలు, ట్రాన్స్‌ పోర్ట్‌ బల్లు, విద్యుత్ సబ్సిడీలు, ఆర్‌డబ్ల్యుఎస్‌, సివిల్ సప్లైస్‌, అగ్రికల్చర్‌ అన్ని శాఖలకు రూ.42,183 కోట్లు బకాయిలు పడితే తాము చెల్లించామని, సర్వసాధారణంగా జరిగే వాటిని భూతద్ధంలో చూపించి ఏదో జరిగిపోతున్నట్టు భ్రమ కల్పిస్తున్నారని ఆరోపించారు.

ఎఫ్‌ఆర్‌బిఎంకు మించి అప్పులు…

చంద్రబాబు తన పాలనలో 2014-19 మధ్య రూ.28,457కోట్లను పరిమితికి మించి అప్పులు చేశారని, 2014-19 మధ్య ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి మించి అప్పులు చేశారని కాగ్‌ నివేదికలు వెల్లడించాయని, దాంతో తర్వాత ఐదేళ్ల తమ ప్రభుత్వంలో అప్పులపై కోతలు పడ్డాయని జగన్ చెప్పారు. తమ హయంలో కేవలం రూ.1600కోట్లు మాత్రమే అదనంగా అప్పు చేశామని, ఎవరు క్రమశిక్షణతో నడిచారో, ఎవరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారో తెలుస్తుందన్నారు.

సూపర్ సిక్స్‌ ఎగ్గొట్టడానికి భూతం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు హయంలో కోవిడ్ వంటి మహమ్మారి ఎప్పుడూ లేదని, తమ ప్రభుత్వంలో ఆయన అధికారంలో వచ్చే నాటికి లక్షా 30వేల కోట్లు అప్పులుంటే దిగిపోయే నాటికి రూ.3.3లక్షల కోట్లకు పెరిగితే వార్షిక వృద్ధి రేటు చూడాలన్నారు. చంద్రబాబు హయంలో 19.54శాతం అప్పుల వృద్ధిరేటు ఉంటే తమ పాలనలో నాలుగు శాతం తక్కువగా 15.61శాతం మాత్రమే ఉన్నాయన్నారు.

హామీలు ఎగ్గొట్టే ప్రయత్నాలు…

కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎస్‌బిఐ, ఐఓసీ వంటి సంస్థలు ఉంటాయని, వాటి అప్పులు కేంద్రానికి వర్తించవని, అవి నాన్ గ్యారంటీ అప్పులు అంటారని, చంద్రబాబు సంతృప్తి కోసం అలాంటి అప్పులు కూడా లెక్కలోకి తీసుకున్నా అధికారంలోకి రూ.8600కోట్లు ఉంటే, అధికారం పోయేనాటికి రూ. 77వేల కోట్లకు పెంచాడన్నారు. తమ ప్రభుత్వంలో గ్యారంటీ అప్పులను రూ.75వేల కోట్లకు తగ్గించామన్నారు.చంద్రబాబు ఐదేళ్లలో 54.98శాతం నాన్ గ్యారెంటీ అప్పులు పెరిగాయని చెప్పారు. తమ ప్రభుత్వంలో 0.48శాతం మాత్రమేనని చెప్పారు.

ఏపీప్రభుత్వం గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారెంటీ అప్పులు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి 2014లో చంద్రబాబు వచ్చేనపాటికి రూ.1.48లక్షల కోట్లు అప్పులు ఉంటే, చంద్రబాబు .3.90లక్షల కోట్లకు చేరాయని, తమ హయంలో రూ.3.90లక్షల కోట్ల నుంచి రూ.7.21కోట్లకు చేరాయని చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 13.5శాతం ఉంటే వైసీపీ హయంలో 10.5శాతానికి పడిపోయిందని చెప్పారని, తమ ప్రభుత్వంలో కోవిడ్ బారిన రెండేళ్లు ఉందన్నారు. దేశం పరిస్థితి, ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలన్నారు.చంద్రబాబు ప్రజల్ని మోసం చేసి ఎన్నికల హామీలను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

Whats_app_banner