Minister Karumuri : రాష్ట్రంలో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ కుట్ర
Minister Karumuri Nageswara Rao: రాష్ట్రంలో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి రాజకీయం చూస్తున్నారని…. టీడీపీ–జనసేన కూటమిని ప్రజలు నమ్మడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయమన్నారు.
Minister Karumuri Nageswara Rao: చంద్రబాబు జైలుకు వెళ్లిన నాటి నుంచి టీడీపీ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు మంత్రి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. టీడీపీ ఏం చేసినా ప్రజలు మాత్రం ఒక్క క్షణం కూడా చంద్రబాబు గురించి ఆలోచించడం లేదన్నారు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే… ముఖ్యమంత్రి జగన్ డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు వెళ్తున్నారని… వ్యాధులు గుర్తించి మంచి వైద్యం అందిస్తున్నారని గుర్తు చేశారు.
“చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ సామాజికవర్గానికి చెందిన వారంతా మీటింగ్‌లు పెట్టుకున్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయలేదు. ఆయన ఎన్నో తప్పులు చేశాడు. ఇప్పుడు పాపం పండి, జైలుకు వెళ్లాడు అని. అదే ఆరోజు జగన్‌పై తప్పుడు కేసులు పెట్టి, కాంగ్రెస్, టీడీపీ కుట్ర చేసి జైలుకు పంపారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఆయన నిధులు విడుదల చేయాలని 13 చోట్ల స్వయంగా సంతకాలు పెట్టారు. ఇవాళ కోర్టుల్లో లాయర్లకు కోట్లు వెదజల్లుతున్నారంటే, ఏ స్థాయిలో చంద్రబాబు దోపిడి చేశారనేది అర్ధమవుతుంది. చంద్రబాబు తప్పు చేశాడని కోర్టు నమ్మింది కాబట్టి, ఆయనను కస్టడీకి పంపారు. అందులో సీఎం ప్రమేయం ఏముంది? ఆయనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? చంద్రబాబు తన పాలనలో తన వర్గానికి, రామోజీరావుకు మేలు చేశారు. నిజానికి ఆయన ప్రజలకు చేసిందేమీ లేదు” అని మంత్రి కారుమూరి విమర్శించారు.
“చంద్రబాబు హయాంలో పెత్తనమంతా జన్మభూమి కమిటీలదే. వారు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా అవినీతి చేశారు. అడ్డగోలుగా దోచుకు తిన్నారు. ఇప్పుడు ప్రతి పథకం పూర్తి పారదర్శకంగా అమలవుతోంది. లబ్ధి నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది. వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పని చేస్తుంటే.. చంద్రబాబుకు, పవన్‌కు మింగుడు పడడం లేదు. నిజానికి గతంలో బాబు పాలనలో ఏనాడూ, ఇలా పథకాలు అందలేదు. తెలుగుదేశం పార్టీకి చివరకు కార్యకర్తలు కూడా లేకుండా పోయారు. దీంతో రాష్ట్రంలో ఎలాగైనా అలజడులు సృష్టించాలన్న దురుద్దేశంతో టీడీపీ పూటకో పిలుపునిస్తోంది. ఇవాళ, జగన్‌గారు ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా మారిపోయారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేస్తున్నారు” అని చెప్పారు.
ఎవరికి అర్థం కావటం లేదు…
పవన్‌కళ్యాణ్ వారాహి యాత్ర బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు మంత్రి. ఇంతకాలం చంద్రబాబు, లోకేశ్.. ఏం మాట్లాడారో.. ఎలా తిట్టారో.. అవన్నీ ఇప్పుడు పవన్‌తో మాట్లాడిస్తున్నారని అన్నారు." చంద్రబాబు తనపై ఉన్న 20 కేసుల్లో స్టే తెచ్చుకుని, విచారణ జరగకుండా అడ్డుకుని, తాను నిప్పును అంటున్నాడు. గతం అంతా మర్చిపోయిన పవన్ ఇప్పుడు ప్రభుత్వంపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడా పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు. సీఎంను అదేపనిగా విమర్శిస్తున్నాడు. అంతే తప్ప, తమ ఎజెండా ఏమిటి? అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? అన్న ఒక్క మాట కూడా చెప్పడం లేదు. షూటింగ్ విరామంలో వస్తున్నాడు. యాత్ర చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు" అని దుయ్యబట్టారు.
“లోకేశ్‌ను ఢిల్లీలో ఎవరూ ఆదరించలేదు. చంద్రబాబు అరెస్టును ఎవరూ తప్పు పట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎంత అవినీతిపరుడో ఢిల్లీలో కూడా అందరికీ తెలుసు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. నిజానికి ఆయన చాలా వాటిలో అవినీతి చేశాడు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కూడా బయటకు వచ్చింది. అందులో, రూ.125 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ స్కామ్ కూడా బయటకు వస్తోంది” అని చెప్పుకొచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.