Kakinada : విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన -వెలుగులోకి ఉపాధ్యాయుడి కీచకపర్వం, పోక్సో కేసు నమోదు
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి జరిగింది. ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. విద్యార్థినుల ఫిర్యాదుతో సదరు ఉపాధ్యాయుడిపై పొక్సో కేసు నమోదైంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు జిల్లా విద్యాధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాకినాడలో విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచక బుద్ధి బయటపడింది. విద్యార్థినీల ఒంటిపై తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇన్నాళ్లూ ఎవరికి చెప్పాలో తెలియక లోలోపలే భయపడుతూ బాధపడ్డారు. పాఠశాలలో పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థినీలు ఇదే సరైన సమయమని భావించి, పోలీసులుకు చెప్పారు. దీంతో తల్లిందడ్రులకు విషయం తెలిసి పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని… పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన కాకినాడలోని శ్రీగంటి మోహన బాలయోగి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. కాకినాడ వన్‌టౌన్ సీఐ ఎం. నాగ దుర్గారావు అందించిన వివరాల ప్రకారం…. నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలపై గణితం ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ఒంటిపై ఎక్కడపడితే అక్కడ, వేయరానిదగ్గర చేతులు వేస్తున్నాడు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతోంది. కానీ విద్యార్థినీలు ఎవరికి చెప్పాలో తెలియక తమలో తాము బాధపడుతూ వచ్చారు. చివరికి పాఠశాలకు సదస్సు నిమిత్తం వచ్చిన మహిళ పోలీసులకు ధైర్యం చేసుకుని చెప్పారు. తమపై వక్రబుద్ధితో ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు.
శనివారం పాఠశాలలో వన్‌టౌన్ మహిళ పోలీసులు గుడ్ టచ్...బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు ముగిసిన తరువాత ఆరో తరగతి విద్యార్థినులు కొంతమంది సదస్సుకు వచ్చిన మహిళ పోలీసులకు తమకు జరుగుతున్న లైంగిక హింసపై తెలిపారు. పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు తమపై చేతులు వేసి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులకు తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇంటివద్ద ఉన్న ఉపాధ్యాయుడిని కొట్టుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లారు.
ఎంఈవో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, తల్లిదండ్రులు వదలేదు. వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు పాఠశాల వద్దకు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ విద్యార్థినీల తల్లిదండ్రులు, బంధువులు ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలని పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. మీకు న్యాయం చేస్తామని సీఐ చెప్పడంతో కొద్ది సేపటి తరువాత వాహనానికి అడ్డుతగిలారు. ఉపాధ్యాయుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. మరోవైపు డీఈవో స్పందిస్తూ విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.