Karimnagar : కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ మోసం - తీగ లాగితే డొంక కదిలింది..!-cyber fraud in the name of customs department in karimnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ మోసం - తీగ లాగితే డొంక కదిలింది..!

Karimnagar : కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ మోసం - తీగ లాగితే డొంక కదిలింది..!

HT Telugu Desk HT Telugu
Nov 24, 2024 07:45 AM IST

కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తులు కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా మోసం చేశారు. ఆమె వద్ద నుంచి రూ.21 లక్షల 80 వేలు కాజేశారు. మోసపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఒడిస్సా కు చెందిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.

కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ మోసం
కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ మోసం (HT Photo)

సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చిందో అంతకంటే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ మోసాలపై పోలీసులు ఎన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా రోజు ఏదో ఒక చోట సైబర్ నేరగాళ్ల ఉచ్చులకు జనం చిక్కుతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది.

కరీంనగర్ జిల్లా కు చెందిన మహిళా కు కస్టమ్స్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారిగా సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టుకు పార్సిల్ వచ్చిందని... అందులో బ్యాంక్ ఎటిఎం కార్డులు, డ్రగ్స్, పాస్ పోర్టు ఉన్నాయని వెంటనే ఢిల్లీ పోలీసులతో మాట్లాడాలని అగంతకుడు ఫోన్ చేశాడు. కాన్ఫరెన్స్ కాల్ లో పోలీసు అధికారులున్నారని మాట్లాడించి బాధితురాలిని మోసం చేశాడు.

మహిళ తనతో మాట్లాడుతున్నది కస్టమ్స్ ఆఫీసర్ అని నమ్మి అగంతకుడు ఇచ్చిన బ్యాంక్ అకౌంటుకు రెండు దఫాలుగా రూ.21.80 లక్షలు పంపించారు. తరువాత అనుమానం రావడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సెంటర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కరీంనగర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న డీఎస్పీ నర్సింహారెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సైబర్ నేరస్థుడు పోలీసులకు చిక్కాడు.

తీగ లాగితే డొంక కదిలింది..

ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ నేతృత్వంలోని బృందం ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ జిల్లాలో తలదాచుకున్న సదాన్షు శేఖర్ మహంతిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. భువనేశ్వర్ లో వ్యాపారం చేస్తున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు నమ్మించి సదాన్షు శేఖర్ మహంతి ORPLE APPLIANCES PVT LTD పేరు పై బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు.

తన అన్న అయినటువంటి సర్వేశ్వర్ మహంతి సహాకారంతో బ్యాంక్ అకౌంట్ ఖాతా తీసుకున్నట్టుగా సైబర్ పోలీసుల విచారణలో తేలింది. బాధితులకు ఫోన్లు చేస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ వసూళ్లకు పాల్పడుతుండేవాడు. సర్వేశ్వర మహంతి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారని, అతనిపై అక్కడ కూడా కేసులు నమోదయ్యాయని కరీంనగర్ సైబర్ వింగ్ పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సదాన్షు శేఖర్ మహంతి వివిధ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు.

నిందితుడిపై 24 కేసులు...

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ సైబర్ మోసాలకు పాల్పడిన సదాన్షు శేఖర్ మహంతి పై 24 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలోని మూడు జిల్లాల్లో, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తేల్చారు. నిందితుడిని పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ సైబర్ పోలీసు బృందాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ అభినందించారు.

క్రిమినల్స్ ఇచ్చే సొమ్ముకు ఆశపడి ఇద్దరు అరెస్ట్ :

జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు కస్టమర్లు సైబర్ నేరగాళ్లు ఇచ్చే సొమ్ముకు ఆశపడి తమ ఆధారాలన్నీ ఇచ్చేస్తున్నారు. వీటి ఆధారంతో దుండగులు ఆన్ లైన్ లో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. తాము కొట్టేసిన సొమ్మును అందులో జమ చేస్తున్నారు. వెంటనే వేరే అకౌంట్లకు మళ్లిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంగా 16 నెలలుగా ఈ దందా పెద్దఎత్తున సాగుతోందని ఇటీవల జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ప్రముఖ బ్యాంకు ఖాతా నుంచి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రమేశ్, జగిత్యాలకు చెందిన అల్లె సత్యం బ్యాంకు ఖాతాల్లో కొంత సొమ్ము జమ అయింది. ఈ సొమ్మును కస్టమర్లకు తెలియకుండానే పుణెకు చెందిన మరో వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి సైబర్ నేరగాళ్లు మళ్లించారు. విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఇద్దరు బ్యాంకు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని యుపికి తరలించారు. ఈ విషయం తెలియడంతో వివరాలు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఫోన్ నంబర్లు ఇచ్చిన కొందరు ఆందోళన చెందుతున్నారు.

వెల్గటూరుకు చెందిన ఇద్దరి పాత్ర..

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానిక బీట్ జజార్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పట్టణంలోని కొందరికి డబ్బు ఆశచూపి మచ్చిక చేసుకున్నారు. ముంబాయిలోని ప్రధాన కార్యాలయాల ఉద్యోగులతో మాట్లాడి.. స్థానికంగా లావాదేవీలు జరిపే రెండు ప్రైవేటు బ్యాంకుల్లో ఆధారాలు ఇచ్చిన వారిపేరిట ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు.

ఖాతా తెరిచే సమయంలోనే ఆధారాలు ఇచ్చే వ్యక్తి మొబైల్ నంబరును లింక్ చేస్తున్నారు. మరుసటి రోజే ఆ ఫోన్ నంబరు మార్చి ఇంకో మొబైల్ నెంబరు లింక్ చేస్తున్నారు. ఫలితంగా ఏటీఎం కార్డు, పాస్వర్డ్ సైతం వారి చేతికే చిక్కుతున్నాయి. దీంతో ఖతాదారుకు తెలియకుండానే ఒక్కో అకౌంట్ నుంచి నెలకు కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల లావాదేవీలు చేస్తున్నారు. ఒక్కోసారి తమ అకౌంట్లో కొంత సొమ్ము జమచేస్తున్న కస్టమర్లు.. తమ ఫోన్ నంబరుకు మెసేజ్ రాకపోవడంతో బ్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ మోసాలతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.

సైబర్ క్రిమినల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ సెక్యూరిటీ SHO నర్సింహరెడ్డి సూచించారు. కస్టమ్స్ , ట్రాయ్ పేరుతో వస్తున్న ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అగంతకుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని, అప్లికేషన్ ఫైల్స్ ను డౌన్ లోడ్ చేయొద్దని వాటిపైన క్లిక్ చేయరాదని కోరారు.

మరోవైపు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆక్రమణలకు పాల్పడే వారిపై ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కొరడా ఝులిపించడం ఆపలేదు. తప్పు దారుల్లో భూములను ఆక్రమించుకునేందుకు స్కెచ్ వేసిన వారిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. కరీంనగర్ లో నకిలీ ధృవపత్రాలు సృష్టించి భూమి ఆక్రమించిన నలుగురు పై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరొకరు పరిపోగా అతని కోసం గాలిస్తున్నారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner