Tiruchanoor Padmavathi Brahmotsavam : నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు-టీటీడీ
Tiruchanoor Padmavathi Brahmotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల రోజులతో పాటు పంచమితీర్థం నాడు మెరుగ్గా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఈవో పోలీసులకు సూచించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. తిరుచానూరులోని పసుపు మండపం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో తిరుపతి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సివీఎస్వో శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభన్ బన్సాల్ తదితర అధికారులతో కలిసి శనివారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ... నవంబర్ 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పీఏ సిస్టమ్, ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాలతో ఆకర్షణీయంగా ఉండేలా ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు.
శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని ఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు మెరుగ్గా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ, పోలీస్, తిరుచానూరు పంచాయతీ అధికారులకు ఈవో శ్యామల రావు సూచించారు. తిరుపతిలోని పద్మావతీ గెస్ట్ హౌస్ లో టీటీడీ తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, సివీఎస్వో శ్రీ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభన్ బన్సాల్ తదితర అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
వచ్చే నెల 6న పంచమీ తీర్థం
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ 6వ తేదీన నిర్వహించనున్న పంచమీ తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, పుష్కరిణిలో తోపులాటలు జరుగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమన్వయం చేసుకోవాలి సూచించారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల అనంతరం భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తిరుపతి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైన వైద్య బృందాలు, బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, మొబైల్ ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స వైద్య బృందాలు, సైన్ బోర్డ్ ల ఏర్పాటు, భక్తుల తాకిడికి తగ్గట్టుగా అన్నప్రసాదాల పంపిణీ చేపట్టాలని, అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసుకుని భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయ మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
టీటీడీ పథకాలకు రూ.2.02 కోట్లు విరాళం
చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఆ మేరకు దాత డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
సంబంధిత కథనం