TTD Donation : టీటీడీకి చెన్నై భక్తుడి భారీ విరాళం - రూ.2.02 కోట్లు అందజేత-vardhaman jain a devotee from chennai donated rs 2 crore to ttd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Donation : టీటీడీకి చెన్నై భక్తుడి భారీ విరాళం - రూ.2.02 కోట్లు అందజేత

TTD Donation : టీటీడీకి చెన్నై భక్తుడి భారీ విరాళం - రూ.2.02 కోట్లు అందజేత

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 24, 2024 08:11 AM IST

TTD News : చెన్నైకి చెందిన భక్తుడు టీటీడీ రూ.2.02 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇందులో టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.

టీటీడీకి భక్తుడు రూ.2.02 కోట్ల విరాళం
టీటీడీకి భక్తుడు రూ.2.02 కోట్ల విరాళం

చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. ఏకంగా రూ. రూ.2.02 కోట్లను అందజేశాడు. ఈ మేరకు శనివారం టీటీడీ అధికారులకు డీడీలను అందజేశారు. టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం కలిపి రూ. 2.02 కోట్లు అందజేశారు.

ఆ మేరకు దాత వర్ధమాన్ జైన్ డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష :

తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి, పోలీస్, తిరుచానూరు పంచాయతీ అధికారులకు సూచించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ లో అధికారులతో శనివారం సమీక్షించిన ఈవో… పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ… 6వ తేదీన నిర్వహించనున్న పంచమీ తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, పుష్కరిణిలో తోపులాటలు జరుగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమన్వయం చేసుకోవాలి సూచించారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల అనంతరం భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తిరుపతి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

అవసరమైన వైద్య బృందాలు, బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొబైల్ ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స వైద్య బృందాలు, సైన్ బోర్డ్ ల ఏర్పాటు, భక్తుల తాకిడికి తగ్గట్టుగా అన్నప్రసాదాల పంపిణీ చేపట్టాలని, అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసుకుని భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయ మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు.

నవంబర్ 28 నుంచి డిసెంబ‌రు 6వ తేదీ వరకు తిరుచానురూలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో ప్రకటించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను త్వరిత‌గ‌తిన‌ పూర్తి చేయాలని సూచించారు.

ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పీఏ సిస్టమ్‌, ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో క‌ళాబృందాలతో ఆకర్షణీయంగా ఉండేలా ప్రద‌ర్శన‌లు చేపట్టాలని సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు.

Whats_app_banner