MLA Pantham Nanaji : వైద్యుడిపై బూతులతో రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే నానాజీ - మరోవైపు అనుచరుల దాడి..!
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ వైద్యుడిపై దురుసుగా ప్రవర్తించటమే కాకుండా… బూతులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనను ఏపి ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ బూతులతో రెచ్చిపోయారు. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఆయన అనుచురులు దాడికి దిగారు. ఓ దశలో ఎమ్మెల్యే… వైద్యుడి మాస్క్ ను లాగుతూ దుర్భషలాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏం జరిగిందంటే…?
రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే నానాజీ గతంలో కోరారు.ఇందుకు స్పందించిన ఆర్ఎంసీ అధికారులు… ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం బయట వ్యక్తులు వాలీబాల్ ఆడేందుకు మైదానానికి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
విషయం స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు దృష్టికి వెళ్లటంతో ఆయన అక్కడికి వచ్చారు. పర్మిషన్ వచ్చిన తర్వాతే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉమామహేశ్వరరావుతో పాటు ఆర్‌ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డా.విష్ణువర్ధన్, పలువురు వైద్యులతో అక్కడికి వచ్చినవారు వాగ్వాదానికి దిగారు.
ఇంతలోనే ఈ విషయం ఎమ్మెల్యే నానాజీకి చేరింది. మైదానంలో ఆడనివ్వడం లేదని కొందరు ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్రహంతో ఆర్ఎంసి గ్రౌండ్ కు వచ్చిన ఎమ్మెల్యే నానాజీ.. డాక్టర్ ఉమామహేశ్వరరావు పై దురుసుగా ప్రవర్తించారు. బూతులతో రెచ్చిపోయారు. మరోవైపు ఆయన అనుచరులు దాడికి దిగారు.
డా.ఉమామహేశ్వరరావుపై జరిగిన దాడిని వైద్య విద్యార్ధులతో పాటు ఏపీ డాక్టర్ల అసోసిషియేషన్ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే నానాజీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే అనుచరులను అరెస్ట్ చేయాలని... లేదంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఓ లేఖను కూడా రాసింది. ఈ ఘటనకు సంబంధించిన వైద్యులు… జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈ దాడిని పలువురు దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తరఫ్ చేసి.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ. పవన్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు పోస్టులు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే స్పందన:
ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే నానాజీ స్పందిస్తూ… వైద్యులకు క్షమాపణలు చెప్పారు. ఎస్పీ ఆఫీస్ వద్ద మాట్లాడిన ఆయన… వైద్య వర్గాన్ని ఉద్దేశించి తను మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఇలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే నానాజీ బూతుల దండకం వ్యవహారంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యేను మందలించినట్లు సమాచారం.