Tomato Hair Masks Making: జుట్టు రాలడం, పొడిబారే సమస్యలు ఉన్నాయా? ఈ 5 టమాటా హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి.. తయారీ ఇలా..
Tomato Hair Masks Making: జుట్టుకు టమాటాలు చాలా రకాలుగా మేలు చేస్తాయి. టమాటాలతో సులభంగా మాస్క్‌లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల వెంట్రుకలు రాలడం తగ్గడం, ఒత్తుగా, బలంగా పెరగడం సహా మరిన్ని లాభాలు ఉంటాయి.
జట్టు ఆరోగ్యం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు కోసం మార్కెట్‍లో చాలా ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి. అయితే, ఒకవేళ కెమికల్స్ ఉండే ఉత్పత్తులు మీరు వద్దనుకుంటే ఇంట్లోనే జుట్టు కోసం కొన్ని నేచురల్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. పోషకాలతో నిండిన టమటాలతో జుట్టు కోసం వివిధ మాస్క్‌లు రెడీ చేసుకోవచ్చు.
టమాటాలతో జట్టుకు ఈ ప్రయోజనాలు
టమాటాల్లో జుట్టుకు మేలు చేసే విటమిన్ ఏ, సీ, కేతో పాటు లిక్టోపిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. టమాటాల వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు దక్కుతున్నాయి. తినడం ద్వారా కూడా లాభాలు ఉంటాయి. టమాటాలను హెయిర్ మాస్క్‌లుగా తయారు చేసుకొని వాడితే వెంట్రుకలకు మరింత పోషకాలు అందుతాయి.
జుట్టు పెరుగుదలను టమాటాలు వేగవంతం చేయగలవు. డాండ్రఫ్ కూడా తగ్గేందుకు సహకరిస్తాయి. టమాటాలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించగలవు. ఒత్తుగా పెరిగేలా సహకరిస్తాయి. జుట్టు దృఢత్వం పెరిగేలా టమాటాలు చేయగలవు. జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి.
టమాటా హెయిర్ మాస్క్‌లు ఇలా..
టమాటా, తెనె హెయిర్ మాస్క్
ఓ టమాటాను ముందుగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో ఓ స్పూన్ తేనె వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, మాడు(స్కాల్ప్)కు బాగా పట్టించాలి. సుమారు 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టులో చుండ్రు తగ్గుతుంది. మెరుపు పెరుగుతుంది. జుట్టు దృఢత్వం మెరుగుపడుతుంది.
టమాటా, పెరుగు హెయిర్ మాస్క్
ముందుగా టమాటాలో తగినంత పెరుగు వేసి మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, స్కాల్ప్‌కు బాగా పట్టించాలి. ఆ తర్వాత జుట్టును ఆరనివ్వాలి. అనంతరం కడిగేసుకోవాలి. ఈ మాస్క్ వల్ల జుట్టు పొడిబారడం, చిక్కులు పడడం తగ్గుతుంది.
టమాటా, ఎగ్‍వైట్ హెయిర్ మాస్క్
టమాటాను ముందుగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కోడిగుడ్డులోని తెల్లని సొనను వేసుకోవాలి. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. సుమారు 20 నిమిషాలకు ఆరిపోయాక తలస్నానం చేయాలి.
టమాటా, నిమ్మ హెయిర్ మాస్క్
ఓ టమాటాను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దాంట్లో ఓ నిమ్మకాయ రసం పిండాలి. రెండింటినీ కలిపి జట్టు, స్కాల్ప్‌కు బాగా పట్టించాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఈ మాస్క్ వల్ల చండ్రు సమస్య తగ్గుతుంది.
టమాటా, కలబంద మాస్క్
టమాటాను మ్యాష్ చేసి, అందులో కలబంద జెల్ కలపాలి. రెండింటిని మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దాన్ని జుట్టు, స్కాల్ప్‌కు రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. జట్టు పెరుగుదలకు ఈ మాస్క్ ఎంతో తోడ్పడుతుంది.