తెలుగు న్యూస్ / ఫోటో /
AP Tourism : చరిత్ర చెప్పని ఎన్నో రహస్యాలు ఈ క్షేత్రం సొంతం.. ద్రాక్షారామం దర్శనం పూర్వజన్మ సుకృతం
- AP Tourism : తూర్పుగోదావరి జిల్లా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి వాతావరణంలో ఎంతో చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైంది ద్రాక్షారామం. ఇక్కడి భీమేశ్వరుడిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఓసారి వచ్చి చూడండి.
- AP Tourism : తూర్పుగోదావరి జిల్లా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి వాతావరణంలో ఎంతో చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైంది ద్రాక్షారామం. ఇక్కడి భీమేశ్వరుడిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఓసారి వచ్చి చూడండి.
(1 / 6)
తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి.
(2 / 6)
ద్రాక్షారామ భీమేశ్వరాలయం- నాలుగువైపులా నాలుగు ఎత్తయిన రాజగోపురాలతో, పన్నెండు ఎకరాలకుపై బడిన విస్తీర్ణంలో ఉంది. ఆలయానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ధ్వజస్తంభం 70 అడుగుల పొడుగున దర్శనమిస్తుంది. ఎత్తయిన రాతిగోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్యసన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది.
(3 / 6)
భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం అయిదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. బయటి ప్రహరీ నుంచి వెళ్తే, ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధానాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్లడానికి మెట్లుంటాయి. సుమారు ఇరవై అడుగుల ఎత్తుండే పైఅంతస్థులో మళ్లీ మూడు ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలంయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే ‘చీకటి కోణం’ అంటారు. విద్యుచ్ఛక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. అందువల్ల వీటిలోని మొదటి రెండు ప్రాకారాల గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. మునుపు ఈ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారనీ, అవి భక్తులకు వెలుగులు అందించేవనీ అంటారు. చివరిగా అయిదో ప్రాకారంలో స్ఫటిక లింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దిగువ అంతస్థులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగం, సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది.
(4 / 6)
ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థ నారాయణ వృక్షం ఉంది. సంతానం లేనివారు, లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందనీ, సమస్యలు పరిష్కారం అవుతాయనీ భక్తులు విశ్వసిస్తారు. సప్త గోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరిణికి వెళ్లే తోవలో సప్తర్షులు, అరుంధతీ దేవి ప్రతిమలు ఉన్నాయి. అత్రి, భృగు, కౌస్త, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరస రుషులు, వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్లలో దర్శనమిస్తాయి. ప్రధాన ప్రాకారంలో అనేక మంటపాలున్నాయి. వాటిని కొట్టార, గాంగేయరాయ, గండభేరుండదేవ, నంది, దీపావళి, నాట్య, శనివార, గయ, అర్క, తిరుచుట్టుమాలిక, మృగయా రామ మంటపాలని అంటారు.
(5 / 6)
ద్రాక్షారామంలో నిత్యోత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూ, కనక, వస్తు, వాహన, ద్రవ్య, రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల వసతుల కోసం సత్రాల్ని నిర్మించారు. ఏటా మాఘమాసంలో 8 నుంచి 10 రోజుల పాటు ఇక్కడ కల్యాణోత్సవాలు జరుగుతాయి. అంకురార్పణ, ధ్వజారోహణ, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. ఏటా మార్గశిర పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ, భీమేశ్వరుల్ని ప్రత్యేకంగా దవనంతో అర్చిస్తూ ఉయ్యాల్లో ఊపుతూ డోలోత్సవాన్ని జరుపుతారు.
(6 / 6)
వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకు వేళ్లే ‘తోట ఉత్సవం’, ఉగాది ముందు రోజు ‘కొత్త’ అమావాస్య నాడు ‘మాఘంత దాసోత్సవం’ ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు. వీటితో పాటు చైత్రమాసంలో ‘గౌరీ వ్రతం’, వైశాఖ మాసంలో ‘అక్షయ తృతీయ చందనోత్సవం’ ప్రసిద్ధి చెందినవి. ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అరగంటకూ బస్సులున్నాయి. స్వయంభువుడైన సాంబశివుణ్ణి భీమేశ్వర లింగ రూపంలో దర్శిస్తూ- ‘నమఃపార్వతీపతయే హరహరమహాదేవ’ అని ఎలుగెత్తి ఘోషించే భక్తులకు ద్రాక్షారామం అవశ్య దర్శనీయం.
ఇతర గ్యాలరీలు