Arshdeep Singh IPL Price: ఐపీఎల్ 2025 వేలంలోఅర్షదీప్ సింగ్ కోసం సన్‌రైజర్స్ సాహసం.. ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చిన పంజాబ్
IPL Auction 2025 Live: ఎడమచేతి వాటం భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి వరకూ గట్టిగా పోటీపడింది. కానీ.. అతని పాత జట్టు పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం ప్రయోగించి అతడ్ని ఎగరేసుకుపోయింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పంట పండింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతున్న వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అర్షదీప్ సింగ్ కోసం తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ పోటీకి వచ్చింది.
మధ్యలో సన్‌రైజర్స్ ఎంట్రీ
చెన్నై, ఢిల్లీ ఫ్రాంఛైజీలు రూ.7.75 కోట్ల వరకూ పోటీపడగా.. అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ రేసులోకి వచ్చింది. ఇక అక్కడి నుంచి అర్షదీప్ ధర రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంట్రీ ఇవ్వడంతో.. రూ.12.75 కోట్ల వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశ్చర్యకరంగా పోటీకి వచ్చింది.
ఆర్టీఎం వాడిన పంజాబ్
కానీ.. గుజరాత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. గుజరాత్, హైదరాబాద్ మధ్య పోటీతో.. అర్షదీప్ సింగ్ ధర రూ.15.75 కోట్ల వరకూ వెళ్లింది. ఈ దశలో అనూహ్యంగా అతని పాత జట్టు పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో పంజాబ్, హైదరాబాద్ మధ్య పోటీ జరిగింది. దాంతో ఆఖరికి పంజాబ్ ఫ్రాంఛైజీ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు వాడింది. దాంతో రూ.18 కోట్లకి పంజాబ్‌కే అర్షదీప్ సింగ్ సొంతమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద కేవలం రూ.45 కోట్లే మిగిలి ఉన్నా.. ఒక్క అర్షదీప్ సింగ్ కోసం రూ.18 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు సాహసించడం గమనార్హం.
అర్షదీప్ ఐపీఎల్ గణాంకాలు
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 65 మ్యాచ్‌లు ఆడిన అర్షదీప్ సింగ్.. 76 వికెట్లు పడగొట్టాడు. అయితే.. డెత్ ఓవర్లలో పదునైన యార్కర్లు సంధించగల అర్షదీప్ సింగ్.. భారత్ టీ20 జట్టులోనూ రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్నాడు. దాంతో ఈ పేసర్ కోసం గట్టి పోటీ నడిచింది. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2024లో అర్షదీప్ సింగ్ ఆడాడు.