IPL: ఐపీఎల్‌లో ప‌ది ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌కే అమ్ముడుపోయి... ఆ త‌ర్వాత కోట్లు ధ‌ర ప‌లికిన‌ స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే!-sanju samson to manish pandey which team india cricketers who sold lakhs and crores in ipl auction ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl: ఐపీఎల్‌లో ప‌ది ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌కే అమ్ముడుపోయి... ఆ త‌ర్వాత కోట్లు ధ‌ర ప‌లికిన‌ స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే!

IPL: ఐపీఎల్‌లో ప‌ది ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌కే అమ్ముడుపోయి... ఆ త‌ర్వాత కోట్లు ధ‌ర ప‌లికిన‌ స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే!

Nelki Naresh Kumar HT Telugu
Aug 22, 2024 07:40 PM IST

IPL: ఐపీఎల్ ఆరంభ సీజ‌న్స్‌లో కొంద‌రు టీమిండియా స్టార్ క్రికెట‌ర్లు ప‌ది ల‌క్ష‌ల కంటే త‌క్కువ ధ‌ర‌కే అమ్ముడుపోయారు. ఆ త‌ర్వాత అదే క్రికెట‌ర్లు కోట్ల ధ‌ర ప‌లికి రికార్డు క్రియేట్ చేశారు. ఆ టీమిండియా క్రికెట‌ర్లు ఎవ‌రంటే?

ఐపీఎల్
ఐపీఎల్

IPL:ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ద్వారా టీమిండియా క్రికెట‌ర్లు కోట్ల‌లో సంపాదిస్తోన్నారు. టీమిండియాకు ప్రాతినిథ్యం వ‌హించ‌ని దేశ‌వాళీ క్రికెట‌ర్లు సైతం ఐపీఎల్ వేలంలో కోట్ల‌లో ధ‌ర ప‌లికి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన దాఖ‌లాలు చాలానే ఉన్నాయి. ఐపీఎల్ కార‌ణంగా ప్ర‌తి ఏటా కొత్త ప్ర‌తిభా వెలుగులోకి వ‌స్తోంది.

డిసెంబ‌ర్‌లో 2025 వేలం...

ఐపీఎల్ 2025 వేలం డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నుంది. ఇప్ప‌టి నుంచే ఏ క్రికెట‌ర్ ఎన్ని కోట్ల ధ‌ర ప‌లుకుతాడ‌న్న‌ది క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఐపీఎల్‌లో కొన్నిసార్లు అనామ‌క క్రికెట‌ర్లు కోట్ల‌కు అమ్ముడుపోతే...స్టార్ క్రికెట‌ర్లు ల‌క్ష‌లు మాత్ర‌మే ధ‌ర ప‌లుకుతుంటారు. అలాంటి సీన్స్ కూడా ఐపీఎల్ వేలంలో క‌నిపిస్తున్నాయి. ఓ సీజ‌న్‌లో ల‌క్ష‌లు ధ‌ర ప‌లికి...ఆ త‌ర్వాత సీజ‌న్‌లో కోట్ల‌కు అమ్ముడుపోయిన క్రికెట‌ర్లు ఉన్నారు.

సంజూ శాంస‌న్‌...

టీమిండియా క్రికెట‌ర్ సంజూ శాంస‌న్‌ను 2012 వేలంలో కేవ‌లం ఎనిమిది ల‌క్ష‌ల‌కే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. ఆ ఏడాది వేలంలో అతి త‌క్కువ ధ‌ర ప‌లికిన క్రికెట‌ర్ల‌లో ఒక‌రిగా సంజూ శాంస‌న్ నిలిచాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్‌కు సంజూ శాంస‌న్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. 2022 లో రాజ‌స్థాన్ అత‌డిని 14 కోట్ల‌కు కొన్న‌ది. ప్ర‌స్తుతం ఐపీఎల్ హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న క్రికెట‌ర్ల‌లో ఒక‌డిగా సంజూ శాంస‌న్ నిలిచాడు.

భువ‌నేశ్వ‌ర్ కుమార్‌...

టీమిండియా పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 2009 ఐపీఎల్ వేలంలో కేవ‌లం ఆరు ల‌క్ష‌ల‌కే అమ్ముడుపోయాడు. అత‌డిని ఆర్‌సీబీ అతి త‌క్కువ ధ‌ర‌కు కొన్న‌ది. గ‌త కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌ఫున ఆడుతోన్నాడు భువ‌నేశ్వ‌ర్‌. అత‌డికి ప్ర‌తి ఏటా స‌న్‌రైజ‌ర్స్ ఎనిమిదిన్న‌ర కోట్లు చెల్లిస్తూ వ‌స్తోంది...

మ‌నీష్ పాండే...

టాలెండ్ బోలెడు ఉన్నా... అదృష్టం మాత్రం క‌లిసిరాని క్రికెట‌ర్ల‌లో మ‌నీష్ పాండే ఒక‌రు. ఈ హిట్ట‌ర్ కోసం 2008 ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కేవ‌లం ఆరు ల‌క్ష‌లు మాత్ర‌మే వెచ్చించింది. ఇదే మ‌నీష్ పాండే 2018 ఐపీఎల్ వేలంలో 11 కోట్ల ధ‌ర‌కు అమ్ముడుపోయి షాకిచ్చాడు. ఆ సీజ‌న్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన క్రికెట‌ర్‌గా రికార్డ్ సృష్టించాడు.

స‌న్‌రైజ‌ర్స్ అత‌డిని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. కానీ ధ‌ర‌కు త‌గ్గ ఆట‌ను క‌న‌బ‌ర‌చ‌డంలో మ‌నీష్ విఫ‌లం కావ‌డంతో అత‌డిని వ‌దిలేసింది. ప్ర‌స్తుతం మ‌నీష్ పాండే కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్నాడు. కేవ‌లం యాభై ల‌క్ష‌ల‌కు 2024 వేలంలో కోల్‌క‌తా మ‌నీష్‌ను ద‌క్కించుకున్న‌ది.

క‌రుణ్ నాయ‌ర్‌...

టీమిండియా త‌ర‌ఫున టెస్టుల్లోసెహ్వాగ్‌తో పాటు క‌ర‌ణ్ నాయ‌ర్ మాత్ర‌మే ట్రిపుల్ సెంచ‌రీ సాధించాడు. ట్రిపుల్ సెంచ‌రీతో ఓవ‌ర్‌నైట్‌లోనే హీరోగా మారిన క‌ర‌ణ్ నాయ‌ర్ అంతే వేగంగా జ‌ట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో గ‌త రెండేళ్లుగా ఏ ఫ్రాంచైజ్ అత‌డిని కొనుగోలు చేయ‌డం లేడు. 2012లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క‌ర‌ణ్ నాయ‌ర్‌ను ఆర్‌సీబీ ఎనిమిది ల‌క్ష‌ల‌కు కొన్న‌ది.

ఆ సీజ‌న్‌లో అంత‌గా అవ‌కాశాలు రాలేదు. 2014 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన క‌ర‌ణ్ నాయ‌ర్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. 2018 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ క‌ర‌ణ్ నాయ‌ర్ కోసం 5.6 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ సీజ‌న్‌లో 301 ప‌రుగులు చేశాడు. అయితే టెస్ట్ ఫార్మెట్‌ను త‌ల‌పిస్తూ నెమ్మ‌దిగా బ్యాటింగ్ చేయ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి.