IND vs USA: సూపర్ బౌలింగ్‍తో రికార్డు సృష్టించిన అర్షదీప్ సింగ్.. అమెరికాను కట్టడి చేసిన టీమిండియా.. తక్కువ లక్ష్యం-ind vs usa t20 world cup 2024 bowler arshdeep singh registered best bowling figures in t20 world cup by indian bowler ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Usa: సూపర్ బౌలింగ్‍తో రికార్డు సృష్టించిన అర్షదీప్ సింగ్.. అమెరికాను కట్టడి చేసిన టీమిండియా.. తక్కువ లక్ష్యం

IND vs USA: సూపర్ బౌలింగ్‍తో రికార్డు సృష్టించిన అర్షదీప్ సింగ్.. అమెరికాను కట్టడి చేసిన టీమిండియా.. తక్కువ లక్ష్యం

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 12, 2024 10:08 PM IST

IND vs USA T20 World Cup 2024: అమెరికాను భారత్ కట్టడి చేసింది. టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ ముందు స్వల్ప లక్ష్యం ఉంది.

IND vs USA: సూపర్ బౌలింగ్‍తో రికార్డు సృష్టించిన అర్షదీప్ సింగ్.. అమెరికాను కట్టడి చేసిన టీమిండియా.. తక్కువ లక్ష్యం
IND vs USA: సూపర్ బౌలింగ్‍తో రికార్డు సృష్టించిన అర్షదీప్ సింగ్.. అమెరికాను కట్టడి చేసిన టీమిండియా.. తక్కువ లక్ష్యం (AFP)

IND vs USA: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో దూకుడు మీద ఉన్న టీమిండియా.. అమెరికాతో మ్యాచ్‍‍తో బౌలింగ్‍లో దుమ్మురేపింది. ఆతిథ్య జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. భారత పేసర్ అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూయార్క్ వేదికగా నేడు (జూన్ 12) జరుగుతున్న గ్రూప్-ఏ మ్యాచ్‍లో అమెరికాను తక్కువ స్కోరుకే భారత్ కట్టడి చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. టీమిండియా ముందు 111 పరుగుల లక్ష్యం ఉంది.

yearly horoscope entry point

విజృంభించిన అర్షదీప్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది అమెరికా. అయితే, తొలి ఓవర్ ఫస్ట్ బాల్‍కే అమెరికా ఓపెనర్ షాయాన్ జహంగీర్‌(0)ను భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. టీమిండియాకు శుభారంభం అందించాడు. తొలి ఓవర్లోనే చివరి బంతికి ఆండ్రియెస్ గౌస్‍ను అర్షదీప్ ఔట్ చేశాడు. దీంతో అమెరికా 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఆరోన్ జోన్స్ (11)ను 8వ ఓవర్లో ఔట్ చేశాడు భారత బౌలర్ హార్దిక్ పాండ్యా. మరో ఎండ్‍లో స్టీవెన్ టేలర్ (23) నిలకడగా ఆడాడు. న్యూయార్క్ పిచ్ బ్యాటింగ్‍కు కఠినంగానే ఉండటంతో అమెరికా బ్యాటర్లు వేగంగా పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో 10 ఓవర్లలో 3 వికెట్లకు 42 పరుగులే చేయగలిగింది అమెరికా.

సిరాజ్ సూపర్ క్యాచ్

అయితే, స్టీవెన్ టేలర్ (23)ను 12వ ఓవర్లో బౌల్డ్ చేశాడు భారత స్పిన్నర్ అక్షర్ పటేల్. అమెరికన్ బ్యాటర్ నితీశ్ కుమార్ (27) ఉన్నంత సేపు రాణించాడు. నిలకడగా పరుగులు రాబట్టాడు. అయితే, 15 ఓవర్లో అర్షదీప్ బౌలింగ్‍లో నితీశ్ భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ దగ్గర ఎగిరి అద్భుతంగా క్యాచ్ పట్టాడు భారత ఫీల్డర్ సిరాజ్. దీంతో నితీశ్ వెనుదిరిగాడు.

ఆ తర్వాత కోరీ ఆండర్సన్ (15), హర్మీత్ సింగ్ (10) కాసేపు నిలిచారు. అయితే దూకుడుగా ఆడలేకపోయారు. అర్షదీప్ బౌలింగ్‍లో హర్మీత్ క్యాచ్‍ను భారత వికెట్ కీపర్ పంత్ అద్భుతంగా పట్టాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి బంతిని అందుకున్నాడు. షాడ్లే వాన్ సక్వాల్‍క్విక్ (11 నాటౌట్) చివరి వరకు నిలిచారు. మొత్తంగా 20 ఓవర్లలో 110 పరుగులకు అమెరికా పరిమితం అయింది.

భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికాను దెబ్బకొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసుకున్నాడు. టీమిండియా ముందు 111 రన్స్ టార్గెట్ ఉంది. పిచ్ బ్యాటింగ్‍కు కష్టంగా ఉండటంతో టీమిండియా కూడా ఆచితూచి ఆడే ఛాన్స్ ఉంది. 

అర్షదీప్ రికార్డు ఇదే..

అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‍లో 4 ఓవర్లలో 9 పరుగులకే ఇచ్చిన 4 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‍ టోర్నీల్లో ఓ భారత బౌలర్‌కు ఇదే అత్యుత్తమ గణాంకాలుగా ఉన్నాయి. దీంతో టీ20 ప్రపంచకప్‍ల్లో టీమిండియా బెస్ట్ బౌలింగ్ రికార్డును అర్షదీప్ సాధించాడు.

Whats_app_banner