Shreyas Iyer IPL Price: ఐపీఎల్ 2025 వేలంలో రికార్డ్ ధర పలికిన శ్రేయాస్ అయ్యర్.. కోల్‌కతా పశ్చాతాపం
IPL Costliest Player: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి టైటిల్‌ను అందించిన శ్రేయాస్ అయ్యర్ కోసం ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. ఆఖరికి వద్దని వేలానికి వదిలేసిన కోల్‌కతా కూడా ట్రై చేసింది. కానీ..?
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడ్ని ఇటీవల వేలానికి వదిలేయగా.. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కోసం ఫ్రాంఛైజీలు పెద్ద ఎత్తున పోటీపడ్డాయి.
తొలుత రూ.2 కోట్లకే కోల్‌కతా నైట్‌రైడర్స్ బిడ్ వేయగా.. పంజాబ్ కింగ్స్ పోటీకి వచ్చింది. ఈ రెండు ఫ్రాంఛైజీలకి కెప్టెన్సీ అనుభవం ఉన్న భారత బ్యాటర్ అవసరం ఎక్కువగా ఉండటంతో.. నిమిషంలోనే శ్రేయాస్ ధర రూ.2 కోట్ల నుంచి రూ.7.25 కోట్లకి చేరింది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో కోల్‌కతా డ్రాప్ అవ్వగా.. ఢిల్లీ, పంజాబ్ టీమ్స్ పోటీపడ్డాయి.
ఈ రెండు ఫ్రాంఛైజీలు తగ్గేదేలా అన్నట్లు పోటీపడటంతో.. శ్రేయాస్ అయ్యర్ ధర చూస్తుండగానే నిమిషాల్లో రూ. 10 కోట్లు.. రూ.15 కోట్లు.. రూ.20 కోట్లు, రూ.25 కోట్లు దాటిపోయింది. ఆఖరి వరకూ వదలని పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకి శ్రేయాస్ అయ్యర్‌ని దక్కించుకుంది. ఒకవేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రేయాస్ అయ్యర్‌ను వేలంకి వదలకుండా అట్టిపెట్టుకుని ఉంటే.. రూ.18 కోట్లకే దక్కేవాడు. కానీ.. వేలానికి వదిలి.. వేలంలో అతని కోసం పోటీపడలేక పశ్చాతాపం వ్యక్తం చేసింది.
2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. ఇప్పటి వరకూ అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ప్లేయర్‌గా మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఆస్ట్రేలియాకి చెందిన మిచెల్ స్టార్క్‌ని రూ.24.75 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ గత ఏడాది కొనుగోలు చేసింది. అయితే.. ఆ రికార్డ్‌ను ఈరోజు శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో బ్రేక్ చేశాడు.