Midnight Cravings: అర్ధరాత్రి ఆకలి.. ఏవి పడితే అవి తినొద్దు.. ఇవి తీసుకుంటే బెస్ట్
Midnight Cravings - Healthy Foods: అర్ధరాత్రి ఆకలి అయినప్పుడు ఏది పడితే అది తినడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కడుపులో సమస్య ఉండటంతో పాటు నిద్ర సరిగా పట్టదు. అందుకే అర్ధరాత్రి తినాల్సి వస్తే ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
అర్ధరాత్రి వేళల్లో ఆహారం తినడం అంత మంచిది కాదు. అయితే ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఆకలి అవుతుంది. ఏదో ఒకటి తినాలనే ఆశ కలుగుతుంది. ఎక్కువగా పని చేసి అలసిపోవడమో, డిన్నర్ త్వరగా తినడమో, హార్మోన్ల అసమతుల్యత వల్లనో ఇలా కొన్ని కారణాల వల్ల అర్ధరాత్రి వేళ ఆకలి కావొచ్చు. అయితే, అర్ధరాత్రి వేళ ఏది పడితే అది తింటే కడుపుకు ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రైడ్, జంక్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బిర్యానీలు లాంటివి అప్పుడు అసలు తినకూడదు. కడుపుకు తేలికగా ఉండే ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. అర్ధరాత్రి ఆకలి తీర్చుకునేందుకు ఏవి తింటో మంచిదో ఇక్కడ చూడండి.
నట్స్
అర్ధరాత్రి ఆకలి అయితే.. బాదం, వాల్‍నట్, జీడిపప్పు లాంటి నట్స్‌ను తినొచ్చు. వీలైతే కాసేపు నానబెట్టి తింటే ఇంకా మెరుగ్గా జీర్ణం అవుతుంది. నట్స్‌లో ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కొన్ని నట్స్ తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
కూరగాయల స్టిక్స్
రాత్రివేళ ఆకలి అయితే కూరగాయల సలాడ్ తింటే బెస్ట్. కూరగాయలను స్టిక్స్‌లా కట్ చేసి తినొచ్చు. టేస్ట్ కోసం హమ్మస్‍లో నంచుకొని తీసుకోవచ్చు. కూరగాయాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. పోషకాలు అందుతాయి.
పెరుగు
అర్ధరాత్రి పెరుగు, యగర్ట్ తినొచ్చు. అయితే, ఇందులో చెక్కర కలుపుకోకూదు. తీపి కావాలంటే బెర్రీలు, ఆరెంజ్ సహా పండ్లు కలుపుకొని తీసుకోవచ్చు.
చక్కెర లేకుండా పాలు
పాలు కూడా ఆకలి తీర్చేస్తాయి. అర్ధరాత్రి అకలైతే పాలు తాగొచ్చు. అయితే, అందులో చక్కెర వేసుకోకూడదు. తీపి కోసం తేనె లేకపోతే బెల్లం కలుపుకొని తాగాలి.
పాప్‍కార్న్
అర్ధరాత్రి వేళల్లో పాప్‍కార్న్ కూడా తినొచ్చు. ఇవి కూడా కడుపుకు లైట్‍గా ఉంటాయి. దీంట్లోనూ ఫైబర్ బాగానే ఉంటుంది. అయితే, పాప్‍కార్న్ ప్లెయిన్‍గా ఉండాలి. ఎలాంటి ఫ్లేవర్లు లేని పాప్‍కార్న్ తింటే బెస్ట్.
పండ్లు
రాత్రివేళ ఆకలి అయితే అరటి, యాపిల్, నారింజ లాంటి పండ్లు తినవచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన సంతృప్తి బాగా ఉంటుంది. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అయితే, అర్ధరాత్రి కాస్త పరిమితి మేరనే పండ్లు తీసుకోవాలి.
వేరుశనగలు
వేరుశనగలను వేపుకొని స్నాక్స్‌లా తినొచ్చు. కావాలంటే వేరుశనగలతో చాట్‍లా చేసుకోవచ్చు. అర్ధరాత్రి వేళ ఆకలి అయితే వేరుశనగలు తినడం మేలు. తక్కువగా తిన్నా మంచి ఎనర్జీ వస్తుంది. కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. గుమ్మడి గింజలు కూడా తినొచ్చు.