Ind vs Ban 2nd Test Day 1: 35 ఓవర్లకే ఖేల్ ఖతం.. వర్షం, వెలుతురు లేమితో తొలి రోజు ముగిసిన ఆట
Ind vs Ban 2nd Test Day 1: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే సాధ్యమైంది. వర్షం, వెలుతురు లేమి కారణంగా ఉదయం నుంచీ ఆటకు అంతరాయం ఏర్పడుతూనే ఉండగా.. అంపైర్లు ఇక ఆట సాధ్యం కాదని తేల్చేశారు.
Ind vs Ban 2nd Test Day 1: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ లో శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రారంభమైన ఆటకు వరుణుడు అడ్డు పడుతున్నాడు. తొలి రోజు ఉదయమే వర్షం కారణంగా ఓ గంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్.. మొదటి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. తరచూ వర్షం, వెలుతురు లేమితో అంపైర్లు ముందుగానే తొలి రోజు ఆట ముగించారు.
బంగ్లాదేశ్ తొలి రోజు స్కోరు ఇదీ..
బంగ్లాదేశ్ ను తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. స్వదేశంలో 9 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ టీమ్ ఇలా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.
ఆకాశం మేఘవృతం కావడంతోపాటు పిచ్ లో తేమ ఉండటంతో ఆ కండిషన్స్ ను ఉపయోగించుకోవాలని టీమ్ భావించింది. అయితే ఇండియన్ టీమ్ ఊహించినంత ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది.
తొలి రోజు 35 ఓవర్ల ఆట సాధ్యం కాగా.. బంగ్లాదేశ్ 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఆకాశ్‌దీప్ 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు. స్టార్ బౌలర్ బుమ్రా, మరో పేసర్ సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మొదట్లోనే త్వరత్వరగా వికెట్లు తీసి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టాలని టీమిండియా భావించినా.. ఆశించినంతగా రాణించలేకపోయింది. బంగ్లా లంచ్ సమయానికి 2 వికెట్లకు 74 పరుగులతో ఫర్వాలేదనిపించింది.
బుమ్రాకు దక్కని వికెట్
బంగ్లాదేశ్ ఓపెనర్ జాకిర్ హసన్ డకౌటయ్యాడు. మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ 24 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ ఇద్దరినీ ఆకాశ్‌దీప్ పెవిలియన్ కు పంపాడు. ఇక లంచ్ తర్వాత కాసేపటికి స్పిన్నర్ అశ్విన్ రంగంలోకి దిగి కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (31)ను ఔట్ చేశాడు.
అయితే మరోవైపు మోమినుల్ హక్ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతడు 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటు సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా 9 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం గమనార్హం. పేసర్లకు బాగా కలిసొచ్చే వాతావరణం ఉన్నా బుమ్రాను బంగ్లా బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడుతూ వికెట్ ఇవ్వలేదు. మరోవైపు ఆకాశ్‌దీప్ మాత్రం 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో రోజు బంగ్లాదేశ్ ను త్వరగా ఆలౌట్ చేయగలిగితే ఈ మ్యాచ్ పైనా పట్టు బిగించే అవకాశం టీమిండియాకు దక్కుతుంది.
ఈ రెండో టెస్టుకు కూడా ఇండియన్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. సిరాజ్ స్థానంలో స్పిన్నర్ ను తీసుకుంటారని భావించినా టీమ్ మాత్రం మార్పులు చేయకూడదని నిర్ణయించింది.