Ind vs Ban 2nd Test: నాలుగు దశాబ్దాలుగా ఓటమెరగని స్టేడియం.. టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా?
Ind vs Ban 2nd Test: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు జరగబోయే కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియాకు నాలుగు దశాబ్దాలుగా అసలు తిరుగులేదు. మరి అలాంటి స్టేడియంలో ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా?
Ind vs Ban 2nd Test: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా సులువుగా గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్టు కోసం సిద్ధమవుతోంది. ఈ స్టేడియంలో ఇండియా 1983 నుంచి ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. మరి నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఆ రికార్డును ఇండియన్ టీమ్ కొనసాగిస్తుందా?
తొలి మ్యాచ్‌లోనే ఓడినా..
కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిసారి 1952లో ఇంగ్లండ్ తో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్ లో 8 వికెట్లతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆరేళ్లకు 1958లో వెస్టిండీస్ చేతుల్లోనూ 203 పరుగులతో భారీ ఓటమి తప్పలేదు. అయితే మరుసటి ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గెలిచి గ్రీన్ పార్క్ లో టీమిండియా బోణీ చేసింది.
ఆ తర్వాతి 20 ఏళ్లు కాన్పూర్ లో టెస్టులన్నీ చాలా చప్పగా జరిగాయి. 1959 నుంచి 1979 మధ్య వరుసగా ఏడు టెస్టులు ఫలితం లేకుండా డ్రామా ముగిశాయి. 1979లో ఆస్ట్రేలియాను 153 పరుగులతో చిత్తు చేసి ఈ డ్రాల పరంపరకు టీమిండియా చెక్ పెట్టింది. ఆ మ్యాచ్ తర్వాత కూడా కాన్పూర్ లో జరిగిన మ్యాచ్ లు చాలా వరకూ డ్రాగానే ముగిశాయి.
టీమిండియా హవా
అయితే ఈ మధ్య కొంతకాలంగా ఈ స్టేడియంలో టీమిండియా ఓటమెరగని రికార్డును కొనసాగిస్తోంది. 1996 తర్వాత ఇప్పటి వరకూ కాన్పూర్ లో ఏడు టెస్టులు జరగగా.. అందులో టీమిండియా ఐదింట్లో గెలిచింది. రెండు డ్రా అయ్యాయి. నిజానికి 1983 నుంచి ఈ స్టేడియంలో జరిగిన ఒక్క టెస్టులోనూ ఇండియా ఓడిపోలేదు.
చివరిసారి 1983, అక్టోబర్ లో వెస్టిండీస్ చేతుల్లో ఇండియా ఓడిపోయింది. అదే ఏడాది జూన్ లో వెస్టిండీస్ ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన ఇండియాపై ఆ టీమ్ ఇలా ప్రతీకారం తీర్చుకుంది. ఇక అప్పటి నుంచి కాన్పూర్ లో మరో టెస్టులో ఇండియా ఓడిపోలేదంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఇవీ రికార్డులు
ఈ మధ్య కాలంలో కాన్పూర్ లో టెస్టు క్రికెట్ చాలా తగ్గిపోయింది. 2016, 2021లో రెండు టెస్టులు జరిగాయి. ఆ రెండూ కూడా న్యూజిలాండ్ తోనే కావడం విశేషం. ఈ స్టేడియంలో గుండప్ప విశ్వనాథ్ 776 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా ఉన్నాడు. అతడు ఇక్కడ మూడు సెంచరీలు చేయడం విశేషం.
ఆ తర్వాత 1985, 1996 మధ్య మహ్మద్ అజారుద్దీన్ కూడా ఈ స్టేడియంలో సత్తా చాటాడు. అతడు కూడా ఇక్కడ సరిగ్గా 776 పరుగులే చేశాడు. పైగా అజర్ కూడా మూడు సెంచరీలతో విశ్వనాథ్ ను సమం చేశాడు.
ప్రస్తుత జట్టులో రవీంద్ర జడేజా 142 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా ఉన్నాడు. అతడు ఇక్కడ రెండు టెస్టులు ఆడాడు. ఇక ఓవరాల్ గా కపిల్ దేవ్ 25 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుత జట్టులో ఉన్న అశ్విన్ ఇక్కడ 16 వికెట్లు పడగొట్టాడు.