IND vs BAN 1st Test Updates: చెపాక్ టెస్టులో టీమిండియాకి కొత్త టెన్షన్, బంగ్లాపై గెలుపు ఖాయమే కానీ?-india vs bangladesh 1st test day 4 chennai rain prediction as team india eye massive win vs bangladesh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban 1st Test Updates: చెపాక్ టెస్టులో టీమిండియాకి కొత్త టెన్షన్, బంగ్లాపై గెలుపు ఖాయమే కానీ?

IND vs BAN 1st Test Updates: చెపాక్ టెస్టులో టీమిండియాకి కొత్త టెన్షన్, బంగ్లాపై గెలుపు ఖాయమే కానీ?

Galeti Rajendra HT Telugu
Sep 22, 2024 09:03 AM IST

Chennai weather: చెపాక్‌లో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా గెలుపు ధీమాతో ఉంది. కానీ.. ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే వరుణుడు టీమిండియాని ఎక్కువగా భయపెడుతున్నాడు.

చెపాక్ టెస్టులో భారత్ జట్టు
చెపాక్ టెస్టులో భారత్ జట్టు (PTI)

India vs Bangladesh 1st Test Live Updates: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకి కొత్త టెన్షన్ మొదలైంది. మ్యాచ్‌లో మూడో రోజే (శనివారం) విజయానికి బాటలు వేసుకున్న భారత్ జట్టు.. గెలుపునకి కేవలం 6 వికెట్ల దూరంలో ఉంది.

కానీ.. చెన్నైలో ఆదివారం, సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం కూడా ఆఖరి సెషన్‌లో బ్యాడ్ లైట్ కారణంగా 10 ఓవర్ల ఉండగానే ఆటని అంపైర్లు నిలిపివేసిన విషయం తెలిసిందే.

515 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ ప్రస్తుతం 158/4తో కొనసాగుతోంది. విజయానికి ఆ జట్టు ఇంకా 357 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్: 14 బంతుల్లో), కెప్టెన్ శాంటో (51 బ్యాటింగ్: 60 బంతుల్లో 4x4, 3x6) ఉన్నారు. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376, రెండో ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకి ఆలౌటైంది.

Accuweather.Com నివేదిక ప్రకారం సెప్టెంబర్ 22 (ఆదివారం) చెన్నైలో వర్షం కురిసే అవకాశం 40 శాతం ఉంది. ఉదయం 9 గంటల లోపు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ప్రారంభం కావడం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బ్యాడ్ లైట్ లేదా వర్షంతో మ్యాచ్‌లో ఈరోజు ఆటని రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

Accuweather.Com నివేదిక ప్రకారం ఈరోజు ఏ ఏ సమయాల్లో చెన్నైలో ఎంత శాతం వర్షం పడే అవకాశం ఉందంటే?

  • ఉదయం 9 గంటలకి (51 శాతం వర్షం పడే అవకాశం)
  • ఉదయం 10 (38 శాతం వర్షం పడే అవకాశం)
  • ఉదయం 11 (వర్షం పడే అవకాశం 32 శాతం)
  • మధ్యాహ్నం 12 (వర్షం పడే అవకాశం 28 శాతం)
  • మధ్యాహ్నం 1 (వర్షం పడే అవకాశం 20 శాతం)
  • మధ్యాహ్నం 2 (వర్షం పడే అవకాశం 20 శాతం)
  • మధ్యాహ్నం 3 గంటలకు (వర్షం పడే అవకాశం 20 శాతం)
  • సాయంత్రం 4 (వర్షం పడే అవకాశం 20 శాతం)

ఆదివారమే కాదు.. టెస్టులో ఐదో రోజైన సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం 62 శాతం ఉంది. దాంతో భారత్ జట్టు విజయం సాధించాలంటే వరుణుడు సహకరించక తప్పదు.

టెస్టులో తొలి రెండు రోజులు ఫాస్ట్ బౌలర్లకి సహకరించిన చెపాక్ పిచ్.. అనూహ్యంగా శనివారం బ్యాటర్లకి స్వర్గధామంగా కనిపించింది. దాంతో రిషబ్ పంత్, శుభమన్ గిల్ అలవోకగా సెంచరీలు బాదేశారు. మరోవైపు బంగ్లా కెప్టెన్ శాంటో కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. కానీ ఆదివారం, సోమవారం వర్షం కారణంగా ఆట సాధ్యంకాకపోతే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది.